హైదరాబాద్: అప్పటిదాకా అక్క, అన్నయ్యతో సరదాగా ఆడుకుంటూ గడిపిన మూడున్నరేళ్ల బాలుడిని స్కూల్ బస్సు చిదిమేసిన హృదయ విదారక ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. చిరునవ్వులతో తమ వెంట ఉన్న చిన్నారి కళ్లెదుటే క్షణాల్లో అసువులు బాయడంతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి. శుక్రవారం చర్లపల్లి పోలీస్‌స్టేషన్ పరి«ధిలోని బీఎన్‌రెడ్డినగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డి వివరాల ప్రకారం.. బీఎన్‌రెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్న నీల మౌనికకు ఇద్దరు కుమారులు హేమంత్ (9), మూడున్నరేళ్ల ప్రణయ్‌తో పాటు కూతురు స్నేహ ఉన్నారు.
భర్తతో విభేదాలు రావడంతో మౌనిక రెండేళ్లుగా బీఎన్‌రెడ్డి నగర్‌లోని పుట్టింట్లో నివాసం ఉంటోంది. ఇళ్లల్లో పని చేసుకుంటూ పిల్లలను చదివిస్తోంది. శుక్రవారం హేమంత్, స్నేహ స్కూల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిన్న కుమారుడు ప్రణయ్‌ను అమ్మమ్మ కనకమ్మ ఇంటి అరుగుపై కూర్చొబెట్టిన తల్లి మౌనిక.. హేమంత్, స్నేహలను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లింది.
అదే సమయంలో ప్రణయ్ అరుగు దిగి రోడ్డుపైకి వచ్చాడు. దీనిని గమనించకుండా డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో ప్రణయ్ ముందు చక్రాల కింద పడి నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగును తలపించింది. మృతుడి తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడి మేనమామ వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment