జిల్లాల్లో పరిస్థితిపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల బలాబలాలు, పార్టీ పరిస్థితి తదితర అంశాలపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను టీపీసీసీ సమన్వయ కమిటీ ఆదేశించింది. జిల్లాల్లో ఉన్న స్థానిక పరిస్థితులు, రాజకీయ పార్టీల బలాబలాలకు అనుగుణంగా ఎన్నికల అవగాహనపై నిర్ణయం తీసుకుంటే మంచిదని సమన్వయ కమిటీ భావిస్తోంది. డీసీసీల నుంచి నివేదికలు వచ్చాక రెండురోజుల్లో మరోసారి సమావేశమై...
ఏయే జిల్లాల్లో పోటీ చేయడం, అభ్యర్థులు, ఇతర అంశాలపై చర్చించి ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకోనుంది. ఆది, సోమవారాల్లో ఈ నివేదికలను ఢిల్లీలోని పార్టీ హైకమాండ్‌కు పంపి, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థులు, స్థానిక అవగాహనలపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డి, శ్రీధర్‌బాబు సమావేశమై ఈ అంశాలపై చర్చించారు.
ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీపరంగా మరింత కసరత్తు నిర్వహించాలని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. జిల్లాల్లో పార్టీకున్న బలాబలాలు, ఆయా జిల్లాల్లో ఎమ్మెల్సీని గెలిపించుకొనేందుకు ఏయే పార్టీల నుంచి లోపాయికారీ సహకారం అవసరం, పరస్పర ప్రయోజనాల పరిరక్షణ, అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఉన్న అవకాశాలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి సీట్లున్నందున, కాంగ్రెస్, టీడీపీ చెరొకటి చేజిక్కించుకునేలా చూస్తే మంచిదని ఆ జిల్లాల నేతలు కమిటీ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది.
సీనియర్లు, డీసీసీలతో చర్చించాకే నిర్ణయం: ఉత్తమ్
జిల్లాల్లోని సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులతో చర్చించాకే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలి పారు. సమన్వయ కమిటీ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనే చర్చించామని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కమిటీ సభ్యుల అభిప్రాయాల ప్రకారం జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులతోనూ చర్చలు జరపాలని నిర్ణయించామన్నారు. పార్టీ ముఖ్య నేతలను కూడా సంప్రదించి, మరోసారి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పోటీ తదితర అంశాలపై స్పష్టత వస్తుందన్నారు.