
ప్రణాళిక లేకుండా ఎమ్మెల్యేల శిక్షణ తరగతుల ప్రకటన
ఎమ్మెల్సీ ఎన్నికలు.. పలువురు ఎమ్మెల్యేలకు ఇన్‌చార్జి బాధ్యతలు
దీంతో పలువురు పాల్గొనే అవకాశమే లేదు
లోక్‌సభ స్పీకర్ సైతం రాననడంతో చివరి నిమిషంలో వాయిదా
అప్పటికే సగం ఏర్పాట్లు పూర్తి.. ప్రజా ధనం వృథా
సాక్షి, అమరావతి: సరైన ప్రణాళిక, అవగాహన లేకుండా వ్యవహరించడంతో శాసనసభ నవ్వుల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులపాటు ఎమ్మెల్యేల శిక్షణ తరగతులంటూ హడావుడి చేశారు. లోక్‌సభ స్పీకర్‌ను కూడా ఆహ్వానించారు. లోక్‌సభ స్పీకర్ కార్యాలయ అధికారులు అమరావతి వచ్చి చూసి.. ఇచ్చిన నివేదికతో లోక్‌సభ స్పీకర్ తాను రానని తేల్చి చెప్పడం, ఎమ్మెల్సీ ఎన్నికలుండటంతో సమావేశాలను రద్దు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అసెంబ్లీ వ్యవహారాలు చూసే పెద్దలు ప్రకటించారు.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. రెండో రోజు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడునూ ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు, అతిథులకు పెట్టాల్సిన భోజనాలు, బస, బహుమతులు, నిర్వహణ వంటి వాటి కోసం అసెంబ్లీ అధికారులతో పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు పలు హోటళ్లలో గదులను బుక్ చేశాయి. అతిథుల కోసం మెమెంటోలు, శాలువాలు, బహుమతులనూ కొనుగోలు చేశాయి. చివరికి నిబంధనలను పక్కనపెట్టి మరీ అసెంబ్లీ సభా మందిరంలోనే అతిథులు కూర్చునేందుకు వేదికను ని ర్మించారు.
చివరి నిమిషంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సమావేశానికి రాలేనని చెప్పినట్టు తెలిసింది. నిజానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చేందుకు అంగీకరించారు. లోక్‌సభ స్పీకర్ కార్యాలయం అధికారులు వచ్చి పరిస్థితులను పరిశీలించి వెళ్లారు. అమరావతి అంటే అక్కడ నాలుగైదు భవనాలు తప్ప ఏమీ లేవని, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం లేదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో లోక్‌సభ స్పీకర్.. తాను రాలేనని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
శిక్షణకు ఇదా సమయం!
మరోవైపు ఈ నెల 27వ తేదీన కృష్ణా–గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండడంతో సగం మంది ఎమ్మెల్యేలు ఆ పనిలో ఉన్నారు. వారికి టీడీపీ అధిష్టానం ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మరికొందరు ఎమ్మెల్యేలనూ ఆ ఎన్నికలకు ఇన్‌చార్జిలుగా నియమించి పర్యవేక్షణ చేయిస్తోంది. ఈ పరిస్థితుల్లో 22, 23 తేదీల్లో శిక్షణ తరగతులకు హాజరవడం ఎలా కుదురుతుందని వారి నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది.
అలాగే 28న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉండడంతో ఆ హడావుడిలో శిక్షణ ఎలా సాధ్యమని ఉన్నతాధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అయినా ఎన్నికలు ముగిసిన 8 నెలల తర్వాత ఎమ్మెల్యేలకు శిక్షణ ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వ ముఖ్యులు ఈ శిక్షణ తరగతులను వాయిదా వేయించినట్లు తెలిసింది.
లోక్‌సభ స్పీకర్ రాకుంటే పరువు పోతుందనే ప్రధాన కారణం వాయిదా వెనుక ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అసెంబ్లీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేదికను తొలగించేశారు. మిగిలిన ఏర్పాట్లనూ నిలుపుదల చేశారు. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది.
Comments
Please login to add a commentAdd a comment