మరో 55 వెటర్నరీ సీట్లు ఇవ్వండి
కేంద్ర వెటర్నరీ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి
రాష్ట్రంలో తనిఖీలు చేసిన కౌన్సిల్ అధికారులు
వెటర్నరీ కాలేజీల్లో 70 పోస్టుల భర్తీకి ఆమోదం
హైదరాబాద్: రాష్ట్రానికి అదనంగా 55 బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (బీవీఎస్‌సీ) సీట్లను మంజూరు చేయాలని వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ)కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రెండు రోజుల కింద ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వీసీఐ ప్రతినిధి బృందం.. రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కాలేజీ, కరీంనగర్ జిల్లా కోరుట్ల వెటర్నరీ కాలేజీల్లో మౌలిక వసతులపై తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా వీసీఐ బృందంతో రాష్ట్ర పశు సంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌పీ సింగ్ సమావేశమయ్యారు. కోరుట్ల కాలేజీలో ఇప్పటికే 60 సీట్లు ఉన్నాయని, అదనంగా 15 సీట్లు కావాలని విన్నవించారు. అలాగే హైదరాబాద్‌లోని 60 సీట్లకు అదనంగా మరో 40 సీట్లు ఇవ్వాలని కోరారు. దీనిపై వీసీఐ బృందం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అయితే ఈ రెండు కాలేజీల్లో అదనపు సీట్లను కోరిన నేపథ్యంలో.. ఆ మేరకు 70 మంది బోధనా సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్య కార్యదర్శి ఎస్‌పీ సింగ్ దీనిపై సీఎంకు ప్రతిపాదించినట్లు సమాచారం. కోరుట్ల కాలేజీలో అవసరం మేరకు సిబ్బంది ఉన్నారు. కానీ హైదరాబాద్ వెటర్నరీ కాలేజీలో మాత్రం 13 మంది బోధనా సిబ్బంది కొరత ఉందని వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.కొండల్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలు చేపడితే సరిపోతుందని, ఈలోగా అవసరాన్ని బట్టి డెప్యుటేషన్‌పై పశుసంవర్థక శాఖ నుంచి కొందరిని తీసుకోవాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఆ మేరకు వీసీఐకి హామీ ఇచ్చామని, అదనంగా 55 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.