ఈ సారి నిరాశే..
-
వెటర్నరీ కాలేజీలో ప్రవేశాలు లేవు
-
అనుమతి నిరాకరించిన కౌన్సిల్
-
చివరి నిమిషంలో మార్పులు
-
వచ్చే ఏడాది నుంచి ప్రారంభం
సాక్షి, హన్మకొండ : వరంగల్ వెటర్నరీ కళాశాలలో తరగతుల ప్రారంభానికి మరో ఏడాది పాటు ఎదురుచూడక తప్పడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు వెటర్నిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి నిరాకరించింది. అడ్మిషన్ల నిర్వహణకు తగిన సమయం లేనందున ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి వరంగల్ నగరంలో వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేయాలని భావించింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ఈ ఏడాది జనవరిలో స్వయంగా ప్రకటించారు.
అనంతరం ఏర్పాట్లలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు గత జూలై 23న వరంగల్‌లో వెటర్నరీ కాలేజీ ఏర్పాటు, సిబ్బంది నియామకాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పీవీ నర్సింహరావు వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సూచించింది. కాలేజీ నిర్వహణకు 87 మంది బోధన, 205 మంది బోధనేతర సిబ్బందిని కేటాయించారు. కళాశాల ఏర్పాటుకు హన్మకొండ మండలం మామునూరు సమీపంలోని పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర మత్స్య శాస్త్ర విశ్వవిద్యాలయం, పశు పరిశోధన క్షేత్రం ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ 128 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. దీంతో ఈ ఏడాది ప్రవేశాలు ఉంటాయని అందరూ ఆశించారు.
ఆలస్యంగా ప్రకటన..
వెటర్నరీ కాలేజీ ఏర్పాటుపై వేగంగా నిర్ణయం తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయి. 2016–17 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ.. స్థల సేకరణ పనులే జూలై వరకు కొనసాగాయి. దీంతో కాలేజీ ఏర్పాటుపై ప్రభుత్వం ఆలస్యంగా(జూలై 23న) ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే మెడికల్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్ష పూర్తయింది. ప్రవేశాల కౌన్సెలింగ్ మాత్రం జరగలేదు. ఎలాగైనా ఈ ఏడాది నుంచే ప్రవేశాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది.
అడ్డు తగులుతున్న సాంకేతిక కారణాలు...
వెటర్నరీ కాలేజీలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన తర్వాత కౌన్సిల్ బాధ్యులు కళాశాలలో టీచింగ్ స్టాఫ్, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించాలి. దీనంతటికీ కనీసం రెండు నెలలు పడుతుంది. జూలైలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బాధ్యులు వరంగల్ కాలేజీ ప్రవేశాలపై ^è ర్చించారు. అయితే ఎంసెట్ నోటిఫికేషన్‌లో ఈ కళాశాల పేరు లేకపోవడం ప్రధాన సాంకేతిక సమస్యగా మారింది. అంతేకాక కాలేజీ నిర్వహణకు మౌలిక సదుపాయాలు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. దీంతో ఈ ఏడాది ప్రవేశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి నిరాకరించింది. ఈ మేరకు త్వరలో ఆదేశాలు జారీ చేయనుంది.