
బంగారంపై ‘వ్యవసాయ రుణమాఫీ’ ఎగవేత
అర్హత లేదంటూ 18లక్షల మంది రైతుల ఖాతాలు తిరస్కరణ
♦ ‘వ్యవసాయ రుణం’ అని రాసినా పట్టించుకోని వైనం
♦ రూ.15వేల కోట్ల మేర భారం తగ్గించుకున్న సర్కారు
♦ ఇప్పుడు బంగారంపై పంట రుణాలు వద్దని ఆంక్షలు...
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాం.. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని చెల్లించకండి... అంటూ ఎన్నికలకు ముందు ఊరూరా ప్రచారం చేసిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక మాఫీకి సవాలక్ష షరతులు విధించిన విషయం తెలిసిందే.
తాజాగా.. పథకాన్ని నీరుగార్చేందుకు బాబు సర్కారు మరో ఎత్తు వేసింది. బ్యాంకుల్లో బంగారం తనఖాపెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్న 18 లక్షల రైతులకు చెందిన రూ.15వేల కోట్లకు ఎగనామం పెట్టింది. వ్యవసాయ రుణమాఫీ కోసం ‘బంగారం తనఖాపెట్టిన’ బ్యాంకు ఖాతాలను తిరస్కరించింది. అరకొర మాఫీ కూడా వీరికి కుదరదంటూ నోటీసులు ఇచ్చేస్తున్నారు. ఈ రైతులు వ్యవసాయం కోసం రుణాలు తీసుకోలేదని, ఇతర అవసరాలకు తీసుకున్నారనే నెపాన్ని ప్రభుత్వం ఆపాదిస్తోంది.
దీంతో బంగారం తనఖా పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలు చెల్లించాల్సిందేనని రైతులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. లేకుంటే వేలం వేస్తామంటున్నాయి. దీంతో ఈ రైతులు లబోదిబో అంటున్నారు. మాఫీ కాకపోగా వడ్డీల మీద వడ్డీల భారం పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాఫీ అవుతుందని భావించి రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో ఇప్పుడు వడ్డీ రాయితీ కూడా దక్కకపోగా 18 శాతం మేర వడ్డీ భారం పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. బంగారంపై పంట రుణాలు ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.
ఈ ఆంక్షల కారణంగా రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. బంగారంపై రుణాల కన్నా వ్యవసాయ స్వల్పకాలిక రుణాలు, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలనే మంజూరు చేయాలని గతంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
వేలం నోటీసులే నిదర్శనం
సర్కారు తాజా తీరుకు రైతులకు బ్యాంకులు జారీ చేస్తున్న వేలం నోటీసులే నిదర్శనంగా నిలుస్తున్నాయి.13 జిల్లాల్లో ప్రస్తుతం బ్యాంకులన్నీ బంగారం వేలం పాటలకు పత్రికల్లో ప్రకటనలు జారీ చేస్తున్నాయి. సీఎం సొంత జిల్లా చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు కుప్పంబాదూరు శాఖ ఏకంగా 100 మంది రైతులకు నోటీసులు జారీ చేసింది. ఇవన్నీ బంగారం తాకట్టుపెట్టి వ్యవసాయానికి తీసుకున్న రుణాలుగా పేర్కొంది.
పశ్చిమగోదావరి జిల్లా భారతీయ స్టేట్ బ్యాంకు శ్రీరామ్‌నగర్ శాఖ, తూర్పుగోదావరి జిల్లా సిండికేట్ బ్యాంకు బంగారం వేలం పాటలకు గాను రైతులకు నోటీసులు జారీ చేశాయి. తిరస్కరించిన ఈ తరహా రుణాలు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కలిపి 18 లక్షలమంది రైతులకు చెందిన రూ.15వేల కోట్ల వరకు ఉన్నాయని ‘సాక్షి’కి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
భారమవుతున్న ‘పసిడి’ రుణాలు
సాక్షి, విజయవాడ బ్యూరో: తగ్గుతున్న బంగారం ధరలు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ధర మరింత పతనమైతే రైతుల నుంచి గోల్డులోన్ల రికవరీలు తగ్గుతాయని భావించి రాష్ట్రంలోని బ్యాంకులన్నీ వేలం పాటలకు తెరలేపి నోటీసులు జారీ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాణిజ్య, సహకార బ్యాంకులకు సుమారు రూ.11 వేల కోట్లకు పైగా బంగారు రుణాల బకాయిలు వసూలు కావాల్సి ఉంది.
ఏటా లక్షలాది మంది రైతులు వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల్లో బంగారం తనఖాపెట్టి రుణాలు పొందడం పరిపాటి. బ్యాంకులు ఏడాది కాలపరిమితి కింద బంగారం రుణాలు ఇస్తుంటాయి. కిందటేడాది వ్యవసాయ సీజనులో 10 గ్రాముల బంగారం ధర రూ.28 వేలకు పైగానే ఉంది. అప్పట్లో గ్రాము బంగారానికి గరిష్టంగా రూ.2వేల దాకా రుణ మిచ్చాయి. నెల రోజుల నుంచి బంగారం ధరలు తగ్గడం మొదలయ్యాయి. దీంతో కాలపరిమితి ముగిసిన బంగారం రుణాలను చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నాయి.
వ్యత్యాసపు నగదు, వడ్డీ చెల్లిస్తేనే...
వేలం నోటీసులకు భయపడి రుణాలకు సంబంధించిన వడ్డీ చెల్లించి ఆయా రుణాలను రెన్యువల్ చేయించుకోవాలనుకుంటున్న చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల్లో చుక్కెదురవుతోంది. మార్కెట్‌లో బంగారం ధర బాగా తగ్గిన నేపథ్యంలో కిందటేడాది తీసుకున్న గోల్డులోన్లను రెన్యువల్ చేయడం సాధ్యం కాదని బ్యాంకర్లు చెబుతున్నారు. బంగారం ధరలో ఉన్న వ్యత్యాసపు ధరను చెల్లించడంతోపాటు ఏడాది కాలానికి అయిన వడ్డీ చెల్లిస్తేనే రెన్యువల్ చేయడం సాధ్యమని తేల్చి చెబుతున్నారు.