
బంగారం రుణాలూ మాఫీ: ప్రత్తిపాటి పుల్లారావు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాలతో పాటు బంగా రం రుణాలు కూడా మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూసేందుకు 13 జిల్లాల్లోని వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్లు, అసిస్టెంట్ డెరైక్టర్లతో మం త్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొన్ని జిల్లాల్లో విత్తనాలు, ఎరువులు కొరత ఉన్నట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని ఒకటి రెండు రోజుల్లో ఆ సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. పంట రుణాలు ఎప్పటిలోగా మాఫీపై మరో 15 రోజు ల్లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పంట రుణాలతో పాటు బంగారం రుణాలు కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ సహకారం కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 25న ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మోడీని కలుస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేసినా రుణ మాఫీయే అవుతుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రీ షెడ్యూల్ చేసిన రుణాలను రైతులు చెల్లించాల్సిన అవసరం లేదని సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో చెప్పారు. రీ షెడ్యూల్ చేసిన రుణాలు రైతుల పేరు మీద ఉంటాయా? ప్రభుత్వం పేరు మీద ఉంటాయా? అని అడిగిన ప్రశ్నకు యనమల సమాధానం దాటవేశారు.