ఆరు నెలల కనిష్టానికి బంగారం
బంగారం ధర తగ్గింది...
Published Thu, Dec 1 2016 4:31 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం దూసుకెళ్లిన బంగారం, ప్రభుత్వం విధిస్తున్న పరిమితులు, హెచ్చరికలతో దేశీయంగా అతలాకుతలమవుతోంది. వరుసగా రెండో రోజు బంగారం ధరలు క్షీణించి, ఆరు నెలల కనిష్ట స్థాయికి దిగజారాయి. అంతర్జాతీయంగా వస్తున్న బలహీనమైన డిమాండ్తో పాటు దేశీయంగా జువెల్లరీ వ్యాపారాల నుంచి డిమాండ్ క్షీణించడంతో, బంగారం ధరలు దాదాపు 300 రూపాయల మేర పతనమయ్యాయి.
ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.244 నష్టంతో 29వేల దిగువకు రూ.28,141గా నమోదైంది. వెండి సైతం రూ.41,000 మార్కు దిగువకు వచ్చి చేరింది. రూ.735 నష్టంతో కేజీ ధర 40,700 రూపాయలుగా మార్కెట్లో నమోదైంది. పరిశ్రమ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ తగ్గడంతో సిల్వర్ ధరలు తగ్గినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు.
ట్రంప్ విక్టరీ అనంతరం డాలర్ దూసుకుపోతుండటంతో అంతర్జాతీయంగా డాలర్ ట్రెండ్ బలహీనపడినట్టు ట్రేడర్లు చెబుతున్నారు. బలమైన ఎకానమిక్ డేటాతో ఇతర మేజర్ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ రికార్డులు సృష్టిస్తోంది. దీంతో బంగారం ధరలు అతలాకుతలమవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచనుందనే సంకేతాలతో సురక్షితమైన ఆస్తులుగా పరిగణించబడే మెటల్స్ విలువ కొట్టుకొనిపోతుందన్నారు.
గ్లోబల్గా బంగారం ధరలు 1.25 శాతం క్షీణించి ఒక్క ఔన్స్కు 1,173 డాలర్లగా నమోదయ్యాయి. మరోవైపు పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనంతరం బంగారం కొనుగోళ్లపై పరిమితులు విధిస్తుండటంతో జువెల్లరీ, రిటైలర్ల నుంచి బులియన్ మార్కెట్లో బంగారం డిమాండ్ పడిపోయిందని చెప్పారు.
Advertisement
Advertisement