డాలర్ దెబ్బతో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.
ముంబై: డాలర్ దెబ్బతో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో అమెరికన్ డాలరు బలహీనపడటంతో బంగారం ధరలకు ప్రోత్సాహం లభించింది. ముఖ్యంగా యూరో తొలుత 2 శాతం జంప్‌చేయడంతో డాలర్ విలువ క్షీణించింది. దీంతో వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పాజిటివ్ గా ఉన్నాయి. అటు విదేశీ మార్కెట్లో బంగారం మెరుస్తుండటంతో దేశీయంగానూ ధరలు పురోగమించాయి. 22 కారెట్ల పది గ్రా. బంగారం ధరలు రూ. 26910 వద్ద, 24 కారెట్స్ పదిగ్రా. బంగారం రూ.28780 వద్ద ఉన్నాయి.
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 0.3 శాతం పుంజుకుని 1161 డాలర్లను అధిగమించింది. ఇక వెండి కూడా ఔన్స్ 0.35 శాతం ఎగసి 16.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వరుసగా ఏడో వారం పసిడి పతనం కొనసాగడంతో తక్కవ స్తాయిలో అందుబాటులోకి రావడంతో ట్రేడర్లు మరోసారి కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు భారీగా ధరలు పడిపోనున్నాయనే ముందస్తు అంచనాలతో మదుపర్లు ఇప్పటికే కొనుగోళ్ళకు పాల్పడ్డారు. ఫలితంగా సుమారు26వేల స్థాయికి దిగిరావడంతో షార్ట్ కవరింగ్ కారణంగా పసిడి ధరలు 1130 డాలర్ల స్థాయి నుంచి పుంజుకున్నాయి.
అటు ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల పసిడి ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ. 262 జంప్‌చేసి రూ. 27,562 వద్ద స్థిరపడింది. శుక్రవారం కూడా మరో రూ. 66 ఎగిసి రూ. 27,562 వద్ద ఉంది. వెండి కేజీ మార్చి ఫ్యూచర్ రూ. 130 పెరిగి రూ.39751 వద్ద ట్రేడ్ అవుతోంది.
కాగా ఈ ఏడాది బులియన్ ధరలో దాదాపు మూడేళ్ల తరువాత 8 శాతం పుంజుకోగా, ఒక్క నవంబరు లోనే 8 శాతం పతనమయ్యాయి. అమెరికా ఫెడ్ రేట్లు పెరిగితే బంగారంలో పెట్టుబడులకు తక్కువ అవకాశం ఉంటుందని లండన్ ఆధారిత సన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సీఈవో మిహిర్ కపాడియా తెలిపారు. అయితే ప్రస్తుతం బులియన్ మార్కెట్లో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని మరికొంతమంది ఎనలిస్టులు సూచిస్తున్నారు. అటు కాగా డాలర్ పో పోలిస్తే రూపాయి కూడా ఈ రోజు బాగా బలపడింది. 14 పైసలు పుంజుకుని రూ.67.96 వద్ద ఉంది.