మన బంగారం మరీ ప్రియం | Gold scales to eight-month high at Rs 31,525 | Sakshi
Sakshi News home page

మన బంగారం మరీ ప్రియం

Published Sun, Aug 18 2013 12:27 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

మన బంగారం మరీ ప్రియం

మన బంగారం మరీ ప్రియం

బంగారం ఎక్కడైనా బంగారమే. కానీ ధర మాత్రం ఎక్కడైనా ఒక్కటే అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే విదేశాలతో పోలిస్తే మన దగ్గర బంగారం కాస్త ఖరీదెక్కువ. ఈ ఖరీదు ఎక్కువ ఎందుకయిందయ్యా అంటే... మన రూపాయి అదే పనిగా పడిపోతోంది. దీంతో డాలర్లతో పోలిస్తే రోజురోజుకూ ఎక్కువ రూపాయలు పెట్టాల్సి వస్తోంది. దీనికితోడు బంగారం దిగుమతులపై ఆంక్షలు విధిస్తే ధరలు తగ్గుతాయన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం సుంకాల మీద సుంకాలు వడ్డించేస్తోంది. ఇవన్నీ కలిసి మన బంగారం ధరను పెంచేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే... మన దగ్గర 10 గ్రాముల బంగారం 31,500 పలుకుతోంది. అదే ఫారిన్‌లో అయితే రూ.6 వేలు తక్కువకే వస్తోంది. అదీ కథ. 
 
 దేశంలో బంగారం ధర యమ స్పీడుగా పెరిగిపోతోంది. మరిప్పుడు కొత్తగా బంగారం కొనుక్కోవచ్చా? లేకుంటే మన దగ్గరున్న కాస్తో కూస్తో బంగారాన్ని అమ్ముకుని మళ్లీ ధరలు తగ్గినపుడు కొనుక్కోవాలా? ఇపుడు కొంటే మంచిదా... అమ్మితే లాభమా? ఇంకా ధర ఎంతవరకూ పెరుగుతుంది? తగ్గితే ఎంతవరకూ తగ్గుతుంది? అనే సందేహాలు మన మదుపరులలో మరీ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రియల్ ఎస్టేట్ రేట్లు ఇష్టం వచ్చినట్లు కదులుతుండటంతో బంగారమైతే సురక్షితమన్నది వారి ఉద్దేశం కనక. మరి ఈ సందేహాలకు సమాధానాలున్నాయా...?
 
 అక్కడ తగ్గినా పెరుగుతోంది.. 
 తొలుత బంగారం ధర చూస్తే... ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు 14 శాతం తగ్గాయి. కానీ మన దేశంలో మాత్రం 10% పెరిగాయి. ఏప్రిల్ నెలలో పది గ్రాముల బంగారం ధర రూ.27,900 వద్ద ఉంటే ఇప్పుడది రూ.31,000 దాటింది. ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి కేవలం 4% దూరంలో ఉంది. అదే అంతర్జాతీయ మార్కెట్లో అయితే ఏప్రిల్‌లో ఔన్స్ బంగారం ధర 1,600 డాలర్లుండేది. దాదాపు 14 శాతం వరకూ పతనమై ప్రస్తుతం 1,370 డాలర్ల వద్ద కదులుతోంది. అక్కడ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి ఇంకా 28% దూరంలో ఉంది. ఇక్కడ మాత్రం రేపోమాపో కొత్తగరిష్ట స్థాయిని దాటేటట్లు కనిపిస్తోంది. 
 
 ఎందుకిలా జరుగుతోంది?
 అంతర్జాతీయంగానైతే బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. దీంతో ధర పడిపోతోంది. ఇక్కడ మాత్రం రూపాయి మారకం విలువ, అదేపనిగా విధిస్తున్న పన్నులు ధరను ఎగదోస్తున్నాయి. ఏడు నెలల కిందట చూస్తే డాలరుతో రూపాయి మారకం విలువ 55 దగ్గరుండేది. ఇపుడు 62కు చేరింది. అంటే 12 శాతం పతనమైంది. ఈ ప్రభావం బంగారంపై పడింది. ఆ మేరకు దేశీయంగా బంగారం ధర పెరిగింది. ఈ ఏడునెలల్లో రూపాయి కారణంగా రూ.3,600 మేర బంగారం ధర పెరిగిందన్నది విశ్లేషకుల మాట. ఇదేగాక... గడిచిన ఏడెనిమిది నెలల్లో దిగుమతి సుంకాన్ని 2 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. ఇలా పెంచటం వల్ల పది గ్రాముల బంగారం ధర రూ.2,400 మేర పెరిగింది. మొత్తం మీద ఈ రెండు కారణాల వల్లే 10 గ్రాముల బంగారానికి అదనంగా రూ.6,000 చెల్లించాల్సి వస్తోంది. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడి రూపాయి విలువ బలపడితే ఆ మేరకు బంగారం విలువ ఇక్కడ తగ్గుతుంది. అలాగే దిగుమతి సుంకం పెంచటం కూడా స్వల్పకాలిక చర్యే అంటున్నారు కనక... కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం మొదలైతే ఈ సుంకాన్ని తగ్గించే అవకాశముంది. ఇది జరగటానికి కొంత సమయం పడితే పట్టొచ్చు గానీ... ఎప్పటికైనా దేశీయ బంగారం ధరలు అంతర్జాతీయ ధరలతో అనుసంధానం కావాల్సి ఉంది.
 
 విదేశాల నుంచి చౌక..
 ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో కొనుక్కునే బంగారం ఇక్కడకన్నా చౌకగానే లభ్యమవుతుంది. అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి. మనం రూపాయలు చెల్లించి డాలర్లు కొనుక్కుని... ఆ డాలర్లతో విదేశాల్లో బంగారం కొంటే మనకు ఒరిగేదేమీ ఉండదు. కేవలం పన్నుల రూపంలో ఇక్కడ విధిస్తున్న రూ.2400 మేర మొత్తాన్ని మాత్రమే తగ్గించుకోగలం. అలాకాకుండా విదేశాల్లో డాలర్లు ఆర్జించిన ఎన్నారైలు అక్కడే బంగారం కొంటే వారిక్కొంత లాభం ఉంటుంది. అలాంటివారికి అక్కడి నుంచి తెచ్చుకునే పది గ్రాముల బంగారంపై కనీసం ఐదారువేలు కలిసొచ్చే అవకాశముంది. అయితే విదేశాల నుంచి తెచ్చుకునే బంగారంపై ఆంక్షలు చాలానే ఉన్నాయి. విదేశాల నుంచి ప్రయాణికులు వచ్చేటప్పుడు గరిష్టంగా 35 గ్రాములు మించి బంగారాన్ని తెచ్చుకోవడానికి వీల్లేదు. అదే విలువపరంగా అయితే మహిళలు రూ.లక్ష, పురుషులు రూ.50వేలకు మించి బంగారు ఆభరణాలను వెంట తీసుకురాకూడదని చట్టాలు చెబుతున్నాయి. ఒకవేళ అంత కంటే ఎక్కువ మొత్తం బంగారాన్ని తీసుకొస్తే దానిపై పది శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 
 
 దీర్ఘకాలానికి వద్దు
 స్వల్ప కాలానికి దేశీయంగా బంగారం కాస్త ఆకర్షణీయంగా ఉన్నా, దీర్ఘకాలానికైతే అంత అనువుగా కనిపించడం లేదు. డాలరు విలువ మరింత క్షీణించి రూ.64-65 స్థాయికి వెళ్లే అవకాశముంది కనక దేశీయంగా కొత్త రికార్డుస్థాయికి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే సమయంలో ప్రభుత్వం దిగుమతులను తగ్గించడం ద్వారా బంగారం కొరతను సృష్టిస్తోంది. దీంతో ఇక్కడ ధర మరింత పెరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ఎలా కదులుతోందన్నదే ఇక్కడ కీలకం. అక్కడ బాగా క్షీణించడంతో కొద్దిగా రికవరీ కనిపిస్తోంది. 1,400-1,420 డాలర్ల స్థాయిని దాటనంత వరకు బంగారం బేరిష్‌గానే ఉంటుంది. ఫెడ్ ఉద్దీపన ప్యాకేజీలను వెనక్కి తీసుకుంటానని చెపుతుండటం, అక్కడ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుండటం వంటి కారణాలన్నీ బంగారం ధరలు పెరగడానికి ప్రతిబంధకమే. మూడు నుంచి ఐదేళ్ళ కాలానికి ఇన్వెస్ట్ చేసేవాళ్లు బంగారానికి దూరంగా ఉండమనేదే నా సలహా.                
 - ఆర్.నమశ్శివాయ, డెరైక్టర్, జెన్‌మనీ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement