న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్ల రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ స్పష్టం చేసింది. మార్కెట్ వర్గాల అంచనాల ఆధారంగానే నివేదిక తయారు చేశామని, ఇందులో పార్టీలకు కొమ్ముకాసే పక్షపాత ధోరణేమీ లేదని సంస్థ భారత విభాగం సీఈవో బంటీ బోహ్రా తెలిపారు. ఇన్వెస్టర్ల సెంటిమెంటును పార్టీల రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయని మాత్రమే తాము పేర్కొన్నామన్నారు.
ఆసియా పసిఫిక్ పోర్ట్‌ఫోలియో వ్యూహాలపై తమ నివేదికకు క ట్టుబడి ఉన్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే విజయం ఖాయమంటూ గోల్డ్‌మన్ శాక్స్ ఇటీవల ఇచ్చిన నివేదికపై రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ-అవర్ వ్యూ పేరిట నివేదికలో ఈక్విటీ ఇన్వెస్టర్లు బీజేపీని వ్యాపారాలకు అనుకూలమైన పార్టీగాను, మోడీని మార్పునకు ప్రతినిధిగాను భావిస్తున్నారని పేర్కొంటూ.. నిఫ్టీ టార్గెట్‌ను 6,900 పాయింట్లకు సవరించింది. అయితే, ఈ తరహా నివేదికలు అసంబద్ధం, అభ్యంతరకరమైనవంటూ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు.