‘మోడీ ఎఫెక్ట్... 6,900కు నిఫ్టీ’! : గోల్డ్‌మన్ శాక్స్
ముంబై: భారత్ పట్ల అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు ఆశావహంగా ఉన్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి నిఫ్టీ 6,900 పాయింట్లకు చేరుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతమున్న స్థాయి నుంచి చూస్తే ఇది 9 శాతం అధికం. అంతేకాకుండా పీఈ నిష్పత్తికి 14.5 రెట్లు ఎక్కువ. ఇంత ఎక్కువ అంచనాలను వెల్లడించిన తొలి బ్రోకరేజ్ సంస్థ ఇదే కావడం విశేషం. మరో వైపు ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 22,000 పాయింట్లకు చేరుకుంటుందని డాయిష్ బ్యాంక్ అంచనా వేస్తోంది.
2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ అధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఈ రాజకీయ మార్పుకు మెరుగవుతున్న ఆర్థిక పరిస్థితులు కూడా తోడవుతాయని ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోతాయని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని వివరించింది. మూలధన అకౌంట్ ఒత్తిడులు ప్రస్తుతానికైతే తగ్గాయని, అయితే సమస్యలు పూర్తిగా సమసిపోయినట్లు కాదని, వృద్ధి మందగమనంగానే ఉన్నదని వివరించింది.