నోట్ల రద్దుతో మందగమనం
గోల్డ్‌మన్ శాక్స్..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ .. రాబోయే కొంత కాలం మందగించే అవకాశాలు ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కరెన్సీ సంస్కరణలే ఇందుకుప్రధాన కారణం కాగలవని సంస్థ చీఫ్ ఎకానమిస్ట్ జాన్ హట్జియస్ వివరించారు. ప్రస్తుతానికి ఎకానమీ స్వల్పంగా మందగిస్తోందని, సమీప కాలంలో వృద్ధి మరింత దిగువముఖంగా వెళ్లే రిస్కులున్నాయని భావిస్తున్నట్లుఆయన తెలిపారు.
ఇక, 2017లో అమెరికా సారధ్యంలో ప్రపంచ ఎకానమీ వృద్ధి 3.5 శాతం మేర ఉండొచ్చని జాన్ తెలిపారు. ట్రంప్ నేతృత్వంలో అమెరికాలో కొన్ని పన్నులపరమైన సంస్కరణలు, కొంత మేర ఉదారవాదద్రవ్య విధానాలు అమలు, ఇన్‌ఫ్రాపై వ్యయాలు పెరగడం మొదలైన పరిణామాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇవి ఆర్థిక వృద్ధిపై సానుకూలంగా ప్రభావం చూపగలవని జాన్ పేర్కొన్నారు.మరోవైపు, యూరో దేశాల్లో వృద్ధి దాదాపు అదే స్థాయిలో 1.5 శాతం మేర ఉండొచ్చని అంచనాలు నెలకొన్నట్లు వివరించారు.
కనిష్ట స్థాయికి వృద్ధి సూచీలు: నొమురా
పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడినట్లు జపాన్‌కి చెందిన బ్రోకరేజ్ సంస్థ నొమురా పేర్కొంది. దీంతో కీలకమైన వృద్ధి ఆధారిత సూచీలు 1996 తర్వాత కనిష్టస్థాయిలకు పడిపోయాయని వివరించింది. డీమోనిటైజేషన్ కారణంగా సమీప భవిష్యత్‌లో మందగమనం ఉండొచ్చని ఈ పరిణామం సూచిస్తున్నట్లు పేర్కొంది. నవంబర్‌లో వచ్చిన డేటాలో మందగమనం పాక్షికంగానేకనిపించిందని, వృద్ధిపై పడిన పూర్తి ప్రభావం డిసెంబర్ డేటా వచ్చిన తర్వాతే తెలుస్తుందని వివరించింది.
పెద్ద నోట్ల దెబ్బ ప్రభావం పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ కన్నా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంపైనేపడిందని నొమురా తెలిపింది. భారత్‌కి చెందిన కాంపోజిట్ లీడింగ్ ఇండెక్స్ (సీఎల్‌ఐ) 2017 తొలినాళ్లలో వృద్ధికి సంబంధించి గణనీయంగా క్షీణించిందని పేర్కొంది. 1996లో దీన్ని రూపొందించినప్పట్నుంచి ఇది అత్యంతకనిష్ట స్థాయి అని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 6%కన్నా తక్కువగానే ఉంటుందన్న అంచనాలకిది అనుగుణంగా ఉందని నొమురా తెలిపింది. ఫిబ్రవరి ఆఖరు నాటికి నగదు కొరత కష్టాలు తీరవచ్చని, 2017 జూన్‌త్రైమాసికం నుంచి మాత్రమే వృద్ధి రికవరీ మొదలుకాగలదని వివరించింది.