చమురు నిల్వలకు 5 వేల కోట్లు
వైజాగ్‌లోని వ్యూహాత్మక స్టోరేజీ కేంద్రం కోసం కొనుగోళ్లు...
రెండు ఎరువుల ప్లాంట్ల పునరుద్ధరణ
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటాన్ని ప్రయోజనకరంగా మల్చుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా.. అత్యవసర పరిస్థితుల కోసం వ్యూహాత్మకంగా చమురును నిల్వ చేసుకునేందుకు రూ. 4,948 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, కర్ణాటకలోని మంగళూరు, పాడూరులో ఏర్పాటవుతున్న భూగర్భ నిల్వల కేంద్రాలకు అవసరమైన చమురును కొనుగోలు చేసేందుకు ఈ నిధులు వెచ్చించనుంది. 11 రోజుల దేశీయ అవసరాలకు ఈ నిల్వలు సరిపోతాయి. మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
భారతీయ వ్యూహాత్మక స్టోరేజి ప్రోగ్రాం కింద ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ (ఐఎస్‌పీఆర్‌ఎల్) చేపట్టబోయే నిల్వల స్కీమ్ కోసం ఈ నిధులను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, బీహార్‌లో బరౌనీలో రెండు ఎరువుల ప్లాంట్లను రూ. 12,000 కోట్లతో పునరుద్ధరించే ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి అవసరమైన గ్యాస్‌ను సరఫరా చేసేందుకు జగదీశ్‌పూర్-హల్దియా మధ్య గ్యాస్ పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు. ఇక అటు మౌలిక రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టే ప్రాజెక్టులకు మరింత ఆర్థిక సహాయం చేసే విధంగా మార్గదర్శకాలకు సవరణలను క్యాబినెట్ ఆమోదించింది.
భారత్ ప్రస్తుతం ఏకంగా 79 శాతం మేర చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో భవిష్యత్‌లో సరఫరా సమస్యలు ఏమైనా ఎదురైనప్పటికీ.. ఇబ్బందిపడాల్సిన అవసరం లేకుండా వ్యూహాత్మక నిల్వలు నిర్మించడం ప్రాధాన్యతాంశంగా మారింది. ఇప్పటికే వైజాగ్‌లో స్టోరేజీ కేంద్రం నిర్మాణం పూర్తయ్యింది. మంగళూరు కేంద్రం జూన్ నాటికి, పాడూర్ కేంద్రం జూలై నాటికి అందుబాటులోకి రానున్నాయి. వైజాగ్ స్టోరేజీ కేంద్రం అందుబాటులోకి రావడంతో ఈ తరహా వ్యూహాత్మక నిల్వలు ఉన్న అమెరికా, జపాన్, చైనా వంటి దిగ్గజ దేశాల సరసన భారత్ కూడా చేరినట్లవుతుంది. గడిచిన 35 సంవత్సరాల్లో పాశ్చాత్య దేశాలు ఇప్పటిదాకా మూడు సార్లే ఈ తరహా నిల్వలను ఉపయోగించాయి. 1991లో గల్ఫ్ యుద్ధ సమయంలో, 2005లో కత్రినా హరికేన్ వచ్చినప్పుడు, 2011లో లిబియాలో యుద్ధ సమయంలో వీటిని ఉపయోగించాయి.
వైజాగ్ నిల్వల కేంద్రం..
విశాఖపట్నంలో నిర్మించిన భూగర్భ స్టోరేజీ కేంద్రాన్ని దాదాపు పది అంతస్తుల ఎత్తు, సుమారు 3.3 కిలోమీటర్ల పొడవున నిర్మించడం జరిగింది. ఇందులో చమురు కోసం కేంద్ర ఆర్థిక శాఖ తొలుత రూ. 2,399 కోట్లు కేటాయించింది. అయితే, వైజాగ్ కేంద్రం పూర్తి సామర్ధ్యం 10 మిలియన్ బ్యారెళ్లు కాగా.. 6.5- 7 మిలియన్ బ్యారెళ్ల మేర చమురు కొనేందుకు మాత్రమే ఈ మొత్తం సరిపోతుంది. దీంతో వైజాగ్ స్టోరేజీ కేంద్రం మొత్తాన్ని భర్తీ చేసేందుకు వీలుగా సీసీఈఏ తాజాగా రూ. 4,948 కోట్లు మంజూరు చేసింది. వైజాగ్ కేంద్ర అవసరాలు తీరగా మిగిలే మొత్తంతో ఇతర స్టోరేజీ కేంద్రాల కోసం చమురును కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే వైజాగ్ కేద్రం కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) రెండు ఓడల మేర ముడి చమురును కొనుగోలు చేసింది. తాజాగా క్యాబినెట్ ఆమోదంతో వీటికి సంబంధించిన నిధులను చెల్లించడం సాధ్యపడనుంది.