నల్లధనం కుబేరులకు ఊరట
న్యూఢిల్లీ: అప్రకటిత ఆదాయాన్ని వెల్లడించడానికి, నాలుగు నెలల గడువునిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇపుడో మరో భారీ వెసులుబాటును కల్పించింది. నల్లధనం వెల్లడికి గాను ప్రభుత్వం తీసుకొచ్చిన వన్-టైమ్ కాంప్లియన్స్ విండో పథకంలో భాగంగా నల్లధనం డిక్లరెంట్స్ కు గుర్తుతెలియని ఆస్తులపై సర్ చార్జ్ మరియు పెనాల్టీ చెల్లింపులలో మార్పులేదని ఆదాయ పన్ను శాఖ గురువారం స్పష్టం చేసింది. అలాగే మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపుగా చెల్లించాల్సిన పన్నులో విడతలవారీగా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. కొంత భాగాన్ని ఈ సెప్టెంబర్లో, మరికొంతభాగాన్ని వచ్చే ఆర్థిక సం.రం. 2017 సెప్టెంబర్ లోపుగా చెల్లించే వెసులుబాటు కల్పించింది.
ఆదాయాల ప్రకటన, పన్ను చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సరిపోదని వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కొంతమంది వాటాదారుల ఆచరణీయ ఆటంకాలను పరిగణనలోకి తీసుకుని ఈ పథకం కింద చెల్లింపుల కోసం సమయం షెడ్యూల్ పునరుద్దరించాలని నిర్ణయించినట్టు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని ప్రకారం 2016 నవంబరు 30 లోపుగా నిర్దేశిత సర్ చార్జ్, పెనాల్టీ లో కనీసం 25 శాతం చెల్లించాలని పేర్కొంది. మరో 25శాతం మార్చి 31, 2017 లోపు, మిగిలిన మొత్తాన్ని 2017 సెప్టెంబర్ 30 లోపుగా చెల్లించాలని పేర్కొంది.
కాగా 2016-17 బడ్జెట్‌లో 4 నెలల కాంప్లియన్స్ విండోను ప్రకటించారు. ఐడిఎస్(ఆదాయం వెల్లడి పథకం)-2016ను జూన్ 1న ప్రారంభించగా, సెప్టెంబర్ 30తో దీని గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.