బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : కృష్ణానీటిపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ట్రిబ్యునల్ తీర్పుపై శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు.అఖిలపక్షంలో వచ్చే సూచనల అనంతరమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.ఈ సమీక్షా వివరాలను నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి విలేకరులకు తెలిపారు.అన్ని పార్టీలు కూడా ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.ట్రిబ్యునల్ తీర్పుపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు రాకుండా ప్రభుత్వం అఖిల పక్షానికి మొగ్గు చూపింది. వారం రోజుల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు మంత్రి ప్రకటించారు.అనంతరం సుప్రీం కోర్టుకు వెళ్లి ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండా స్టే తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి ఉన్న విషయం తెలిసిందే.
నిర్మాణంలో లేని కాల్వకు నీటి కేటాయింపు
తెలియదన్న మంత్రి : ఇదిలా ఉండగా,ఆర్‌డీఎస్ కుడి ప్రధానకాల్వకు ట్రిబ్యునల్ నాలుగు టీఎంసీల నీటిని కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ కాల్వ ప్రస్తుతం నిర్మాణంలో లేదు. భవిష్యత్తులో నిర్మిస్తామని ట్రిబ్యునల్ ముందు రాష్ర్ట ప్రభుత్వం చెప్పింది. దాంతో దానికి నాలుగు టీఎంసీల కేటాయింపు వచ్చింది. ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువ స్తే ఆ సంగతి తనకు తెలియదన్నారు. సాధారణంగా ట్రిబ్యునల్ ముందు అన్ని రాష్ట్రాలు కూడా తాము భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు మన రాష్ర్టం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించి నిర్మించబోయే ప్రాజెక్టుల జాబితాను ట్రిబ్యునల్ ముందు ఉంచాయి.అందులో ఆర్‌డీఎస్ కుడి ప్రధానకాల్వ ఉంది.అందుకే ట్రిబ్యునల్ దీనికి 4 టీఎంసీలను కేటాయించింది. అలాగే కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా మాస్టర్‌ప్లాన్‌లోని కొన్ని ప్రాజెక్టులకు నీటిని కేటాయించింది.
అఖిలపక్షం తర్వాతే సుప్రీంకోర్టుకు!
Published Sun, Dec 1 2013 1:34 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement