గవర్నర్ హ్యాండిల్ చేయలేకపోతే వెళ్లిపోవాలి: స్వామి
తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు తీరుపై బీజేపీ ఎంపీ, సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ బాధ్యతలను గుర్తుచేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చెన్నైలో ఉండాలని, కానీ ఇక్కడ ఉండకుండా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారని, అసలు ఎవరూ పిలవకపోయినా ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తమిళనాడు పరిస్థితులను ఆయన హ్యాండిల్ చేయలేకపోతే పదవి వదిలేయాలని డిమాండ్ చేశారు. తాను తమిళనాడులో ఉన్న పరిస్థితులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
శశికళను పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని, ఆమెకు సంపూర్ణ బలం ఉందని తెలిపారు. అప్పటికి ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేసి, శశికళ తమ నేత అని ప్రకటించారని, ఆ మేరకు ఒక తీర్మానం కూడా చేసి, ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందించారని గుర్తుచేశారు. దానికి గవర్నర్ వెంటనే స్పందించి ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను పిలవాలని, ప్రమాణస్వీకారం తర్వాత సభలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ అనుసరించాల్సిన పద్ధతి ఇదేనని చెప్పారు. కానీ ప్రస్తుత గవర్నర్ మాత్రం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.