బిహార్‌లో జేపీ స్మారకం
కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ విధించి 40 ఏళ్లు గడచిన సందర్బంగా.. సోషలిస్టు నేత జయప్రకాష్ నారాయణ్‌కు బిహార్‌లోని ఆయన జన్మస్థలంలో జాతీయ స్మారకాన్ని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి సారథ్యం వహించిన జేపీ గౌరవార్థం చప్పారా జిల్లాలోని లాలా కా టోలా, సితాబ్, డియారాలో జాతీయ స్మారకాన్ని నిర్మించాలని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు.
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జేపీ స్మారకంలో ఒక ప్రదర్శనశాల, ప్రజాస్వామ్యంపై అధ్యయనం, పరిశోధనకు ఒక సంస్థ తదితరాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో జేపీ స్మారకాన్ని నెలకొల్పటం ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందేందుకేనన్న వాదనను తోసిపుచ్చారు.
కాగా, దేశంలో ఆరు కొత్త ఐఐఎం (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), బుద్ధగయ (బిహార్), సిర్మౌర్ (హిమాచల్‌ప్రదేశ్), నాగ్‌పూర్ (మహారాష్ట్ర), సంబల్‌పూర్ (ఒడిశా), అమృత్‌సర్ (పంజాబ్)లలో ఏర్పాటు చేస్తారు. సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా పేరును రిన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా మార్చేందుకు.. ఆ సంస్థ వాణిజ్య కార్యకలాపాలు చేపట్టేందుకు సెక్షన్-3 కంపెనీగా రిజిస్టరు చేసుకునేందుకు అనుమతివ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పాస్‌పోర్టుల జారీపై మోదీ అసంతృప్తి....
పాస్‌పోర్టుల పంపిణీ అసమర్థంగా ఉందని, కీలక మౌలికసదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతోందని ప్రధానిఅసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు నిర్దేశించారు. ప్రగతి (సానుకూల పాలన, సమయానికి అమలు) ఐటీ ఆధారిత వేదిక ద్వారా బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలను ప్రస్తావించారు.