ఇక సులభంగా మెడికల్ కాలేజీల ఏర్పాటు
న్యూఢిల్లీ: వైద్యవిద్యా కోర్సుల్లో సీట్ల కొరత భారీగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రమాణాల విషయంలో రాజీపడకుండానే మెడికల్ కాలేజీలకు అనుమతుల ప్రక్రియను సడలించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మరిన్ని సీట్ల అవసరం ఉన్నందున కొత్త కాలేజీల ఏర్పాటుకు వీలుగా నిబంధనలను సడలించాలని భావిస్తున్నట్లు బుధవారం ఆరోగ్యశాఖ పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ తొలి సమావేశంలో మంత్రి ఈ మేరకు తెలిపారు.
జాతీయ అర్హతా ప్రవేశ పరీక్ష(నీట్)ను సుప్రీంకోర్టు రద్దుచేసినా, దాని అమలుపై సానుకూలంగా ఉన్నామని, అందుకే రివ్యూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. పీడీపీ ఎంపీ మహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు ఔషధ బ్యాంకులను ఏర్పాటుచేయాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా కల్పిస్తామన్నారు.