పీయూసీ పత్రాలుంటేనే ఇంధనం
ఒకటో తేదీనుంచి జాతీయ రాజధానిలో అమల్లోకి రానున్న నిబంధన
సాక్షి, న్యూఢిల్లీ: పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ ఉన్న వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలనే నిబంధన త్వరలో అమల్లోకి రానుంది. ఇందుకు ఢిల్లీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వాహనంలో ఇంధనం నింపించుకోవడం కోసం పీయూసీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసే నిబంధనను వచ్చే నెల ఒకటో తేదీనుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందుకు జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యకార్యదర్శి డి.ఎం .స్పోలియా బుధవారం పరిశీలించారు.
రవాణా, పర్యావరణం, ఆహారం, పౌరసరఫరాల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసు అధికారులతో సమావేశమైన ఆయన ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలంటూ ఆదేశించారు. ఈ నిబంధన అమలయ్యేవిధంగా చూడడం కోసం ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని సంబధిత అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఇంకా 17-18 రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్థానికులకు అవగాహన కల్పించాలని ఆయన సంబంధిత విభాగాలను కోరారు.
పీయూసీ సర్టిఫికెట్‌లేకుంటే ఫిల్లింగ్ స్టేషన్లు ఇంధనం నింపబోవనే విషయాన్ని వాహనచోదకులకు తెలియజెప్పడంతో పాటు, ఇంధనం నింపడానికి నిరాకరించాలని ఆయా ఫిల్లింగ్ స్టేషన్లలో పనిచేసేవారికి తెలియజెప్పడం కోసం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. పీయూసీ సర్టిఫికెట్ల ఆవశ్యకతను ప్రజలకు తెలియచెప్పడం కోసం ఫిల్లింగ్ స్టేషన్లలో నోటీసులు అతికించడంతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రచారం చేయాలని ముఖ్యకార్యదర్శి ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ఈయూ-4 వాహనాలకు ఏడాది పాటు చెల్లుబాటయ్యే పీయూసీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుండగా ఇతర వాహనాలు ప్రతి మూడు నెలలకోసారి వీటిని పొందాల్సి ఉంటుంది.వచ్చే నెల ఒకటో తేదీ తరువాత పీయూసీ సర్టిఫికెట్ల కోసం వచ్చే వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుందని అధికారులు అంచ నా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఈ ఒత్తిడిని తట్టుకోవడం కోసం పీయూసీ పత్రాల జారీ కేంద్రాల సంఖ్యను పెంచడంతోపాటు వాటి పనిగంటలను పొడిగించేలా చూడాలని నిర్ణయించారు. నగరంలోని అనేక ఫిల్లింగ్ స్టేషన్లలో పీయూసీ పత్రాల జారీచేసే కేంద్రాలు ఉన్నాయి. ఇలాంటివి లేనిచోట కొత్త వాటిని ఏర్పాటుకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది.