Pollution Under Control Certificate
-
వాహనదారులకు షాక్.. 80 శాతం పెరగనున్న పీయూసీ సర్టిఫికేట్ చార్జీలు
భారతదేశంలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతున్న తరుణంలో రవాణా శాఖ 'పొల్యూషన్ అండర్ కంట్రోల్' (పియుసి) సర్టిఫికేట్ల కోసం చార్జీలను పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికేట్ల కోసం రవాణా శాఖ ఛార్జీలను పెంచనున్నట్లు, దీనికి సంబంధించిన ఒక ప్రతిపాదన రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సీనియర్ డిపార్ట్మెంట్ అధికారి వెల్లడించారు. 2011 నుంచి PUC చార్జీలు పెంచలేదని.. రానున్న కొత్త రేట్లు ద్రవ్యోల్బణం రేటుపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసారు. కొత్త రేట్లు అమల్లోకి వస్తే ధరలు మునుపటి కంటే దాదాపు 80 శాతం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు రవాణా మంత్రి 'కైలాష్ గహ్లోట్' తెలిపారు. కొత్త ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది త్వరలోనే తెలుస్తుంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారం, ప్రతి వాహనం నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత తప్పకుండా పీయూసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ప్రస్తుతం ఢిల్లీలో PUC ప్రూఫ్ పీజు ద్విచక్ర వాహనాలకు రూ.60, పెట్రోల్ ఫోర్ వీలర్ల కోసం రూ. 80, డీజిల్ ఫోర్ వీలర్స్ కోసం రూ. 100. ఈ రేటుపైన 18 శాతం GST కూడా వసూలు చేస్తారు. ఇదీ చదవండి: ఒకప్పుడు పాములు, తేళ్లు తిరిగే కంపెనీ.. టాటా చేతిలో పడ్డాక.. PUC సర్టిఫికెట్ లేని వాహనాలకు రూ.10000 జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో సుమారు 85 శాతం టూ వీలర్స్ పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండానే తిరుగుతున్నట్లు సమాచారం. ఇందులో సుమారు 27.8 లక్షల కార్లకు, 69.8 లక్షల టూ వీలర్లకు పీయూసీ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్నాయని తెలుస్తోంది. రానున్న రోజుల్లో సంబంధిత శాఖ ఇలాంటి వాహనాల మీద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. -
ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ‘పొల్యూషన్’ జరిమానా.. నవ్వులపాలైన పోలీసులు
మలప్పురం: పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రాయితీలు కూడా అందిస్తున్నాయి. మరి ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికెట్ లేదని జరిమానా విధిస్తే?! కేరళ పోలీసులు ఇదే పనిచేసి నవ్వులపాలయ్యారు. మలప్పురం జిల్లాలో కరువరాకుండు పోలీసు స్టేషన్ పరిధిలోని నీలాంచెరీలో గతవారం ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వస్తుండగా తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపేశారు. పీయూసీ సర్టిఫికెట్ లేదంటూ ప్రింటౌట్ చేతిలో పెట్టి, రూ.250 వసూలు చేశారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల నిర్వాకంపై జోకులు పేలాయి. టైపింగ్ మిస్టేక్ వల్లే ఇదంతా జరిగిందని పోలీసులు వివరణ ఇచ్చారు. స్కూటర్ యజమాని డ్రైవింగ్ లైసెన్స్ చూపించలేకపోయాడని చెప్పారు. మెషిన్లో తప్పుగా టైప్ చేయడంతో పీయూసీ సర్టిఫికెట్ లేదంటూ ప్రింటౌట్ వచ్చిందని అన్నారు. -
ఇకపై వాహనాలకు ఏకీకృత కాలుష్య సర్టిఫికెట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఇకపై ఏకీకృత పొల్యూషన్ సర్టిఫికెట్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అందజేసే పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికెట్‌పై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తారు. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ వాహనం, వాహన యజమాని పూర్తి వివరాలు కనిపిస్తాయి. వాహనం యజమాని, అతని ఫోన్ నంబర్, చిరునామా, వాహన ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్, వాహనం కాలుష్యాన్ని ఎంత స్థాయిలో ఉద్గారాలను వెదజల్లుతోంది తదితర వివరాలన్నింటినీ పొందుపరుస్తారు. ఇకపై వాహనం యజమాని మొబైల్ నంబర్‌ను తప్పనిసరి చేశారు. వ్యాలిడేషన్, చెల్లింపులు తదితరాల కోసం ఎస్ఎంఎస్ అలర్ట్లనూ పంపుతారు. పరిమితికి మించి అధిక ఉద్గారాలు వెలువడితే ఇకపై రిజెక్షన్ స్లిప్‌ను ఇవ్వనున్నారు. కేంద్ర మోటార్ వెహికల్ చట్టాలు–1989లో సవరణలు చేసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. ఇకపై పీయూసీ డేటాబేస్‌ను జాతీయ రిజిస్ట్రర్‌తో అనుసంధానిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీసహా ఇతర పత్రాల రెన్యువల్ గడువు పొడిగింపు కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో వాహనాల పత్రాలను రెన్యువల్ చేసుకోలేని వారికి కేంద్రం మరో ఉపశమనం కల్గించింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఫిట్నెస్ సర్టిఫికెట్లతో పాటు అన్ని రకాల పర్మిట్ల చెల్లుబాటును కేంద్రం సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి గడువు ముగిసిన మోటారు వాహన డ్రైవర్లపై విచారణ చేయరాదని రాష్ట్రాల రవాణా శాఖలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఒక అడ్వైజరీ జారీ చేసింది. చదవండి: దేశంలో 8 లక్షల దిగువన కరోనా పాజిటివ్ కేసులు చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
పీయూసీ పత్రాలుంటేనే ఇంధనం
ఒకటో తేదీనుంచి జాతీయ రాజధానిలో అమల్లోకి రానున్న నిబంధన సాక్షి, న్యూఢిల్లీ: పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ ఉన్న వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలనే నిబంధన త్వరలో అమల్లోకి రానుంది. ఇందుకు ఢిల్లీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వాహనంలో ఇంధనం నింపించుకోవడం కోసం పీయూసీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసే నిబంధనను వచ్చే నెల ఒకటో తేదీనుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందుకు జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యకార్యదర్శి డి.ఎం .స్పోలియా బుధవారం పరిశీలించారు. రవాణా, పర్యావరణం, ఆహారం, పౌరసరఫరాల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసు అధికారులతో సమావేశమైన ఆయన ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలంటూ ఆదేశించారు. ఈ నిబంధన అమలయ్యేవిధంగా చూడడం కోసం ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని సంబధిత అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఇంకా 17-18 రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్థానికులకు అవగాహన కల్పించాలని ఆయన సంబంధిత విభాగాలను కోరారు. పీయూసీ సర్టిఫికెట్లేకుంటే ఫిల్లింగ్ స్టేషన్లు ఇంధనం నింపబోవనే విషయాన్ని వాహనచోదకులకు తెలియజెప్పడంతో పాటు, ఇంధనం నింపడానికి నిరాకరించాలని ఆయా ఫిల్లింగ్ స్టేషన్లలో పనిచేసేవారికి తెలియజెప్పడం కోసం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. పీయూసీ సర్టిఫికెట్ల ఆవశ్యకతను ప్రజలకు తెలియచెప్పడం కోసం ఫిల్లింగ్ స్టేషన్లలో నోటీసులు అతికించడంతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రచారం చేయాలని ముఖ్యకార్యదర్శి ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈయూ-4 వాహనాలకు ఏడాది పాటు చెల్లుబాటయ్యే పీయూసీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుండగా ఇతర వాహనాలు ప్రతి మూడు నెలలకోసారి వీటిని పొందాల్సి ఉంటుంది.వచ్చే నెల ఒకటో తేదీ తరువాత పీయూసీ సర్టిఫికెట్ల కోసం వచ్చే వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుందని అధికారులు అంచ నా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఈ ఒత్తిడిని తట్టుకోవడం కోసం పీయూసీ పత్రాల జారీ కేంద్రాల సంఖ్యను పెంచడంతోపాటు వాటి పనిగంటలను పొడిగించేలా చూడాలని నిర్ణయించారు. నగరంలోని అనేక ఫిల్లింగ్ స్టేషన్లలో పీయూసీ పత్రాల జారీచేసే కేంద్రాలు ఉన్నాయి. ఇలాంటివి లేనిచోట కొత్త వాటిని ఏర్పాటుకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది. -
పెట్రోల్ కావాలంటే పీయూసీ చూపాల్సిందే!
న్యూఢిల్లీ: నగరవాసులు ఇకపై వాహనాలపై తిరిగేటప్పుడు తప్పకుండా పొల్యూషన్ సర్టిఫికెట్‌ను తమతోపాటు ఉంచుకోవాల్సిందే.. వాహనానికి పెట్రోలుగానీ, డీజిల్ గానీ పోయించుకోవాలనుకుంటే వారు ఇకపై పొల్యూషన్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాహనం నుంచి వెలువడుతున్న వాయువులు పరిమితిలోనే ఉన్నాయని ధ్రువీకరించే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్‌ను చూపిస్తేనే ఇంధనం నింపాలని పెట్రోల్, డీజిల్ బంకులకు ప్రభుత్వం ఆదేశించింది. నగరంలో నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీలో కొన్ని లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వీటినుంచి వెలువడుతున్న వ్యర్థాలతో నగరంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో ఇకపై పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ కలిగి ఉన్న వాహనాలకే పెట్రోల్, డీజిల్ పోయాలనే నిబంధనను ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం అమలులోకి రావడానికి ఇంకా రెండునెలల సమయం పట్టవచ్చు. అప్పటివరకు ఈ నిబంధనపై నగరంలో విస్తృతంగా ప్రచారంచేసి, వాహనదారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. నగరంలో ఉన్న అన్ని పెట్రోల్, డీజిల్ బంక్‌ల వద్ద ప్రచార వాల్‌పోస్టర్లను అంటించనున్నారు. అలాగే ఆయా బంక్‌ల వద్ద కాలుష్య తనిఖీ వాహనాలను ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటివరకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ తీసుకోనివాల్లు ఆ వాహనం వద్ద తనిఖీ చేయించుకోవచ్చు. నిర్ణయం అమల్లోకి వచ్చాక.. బంకుల్లో పీఎస్ చూపిస్తేనే పెట్రోలుగాని, డీజిల్ గాని పోస్తారు.