ఇంతింతై.. ఉల్లింతై.. | Greenhouse in Onion cultivation | Sakshi
Sakshi News home page

ఇంతింతై.. ఉల్లింతై..

Published Sun, Jan 24 2016 5:03 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఇంతింతై.. ఉల్లింతై.. - Sakshi

ఇంతింతై.. ఉల్లింతై..

* గ్రీన్‌హౌస్‌లో ఉల్లిసాగు... దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో..
* రంగారెడ్డి జిల్లా కీసరలోని రైతు క్షేత్రంలో ఉద్యాన శాఖ శ్రీకారం
* నాలుగింతలు పెరగనున్న దిగుబడులు... 70 రోజుల్లోనే పంట
* ఎకరాకు రూ.6లక్షల ఆదాయం.. ఒక్కో ఉల్లి గడ్డ బరువు 200 గ్రాములు

సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యపరంగా ఉల్లి చేసే మేలు అందరికీ తెలిసిందే. ఆర్థికంగా అది కలిగించే మేలుపై తెలంగాణ ఉద్యాన శాఖ ప్రయోగం చేపట్టింది. అధిక దిగుబడి, అధిక ఆదాయం సాధించే దిశగా ఉల్లిసాగును చేపట్టింది.

గ్రీన్‌హౌస్ (పాలీహౌస్)లో ఉల్లిసాగుకు తెలంగాణ ఉద్యానశాఖ నడుం బిగించింది. దేశంలోనే మొదటిసారిగా రంగారెడ్డి జిల్లా కీసరలో ఒక రైతు పొలంలో ఉల్లి సాగు చేపట్టింది. సాధారణంగా ఒక్కో ఉల్లి గడ్డ బరువు 60 నుంచి 70 గ్రాములుంటుంది. కానీ, గ్రీన్‌హౌస్‌లో పండించే ఉల్లి గడ్డ బరువు 180 నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది. ఉల్లి కొరతతో తెలంగాణ సతమతమవుతోన్న నేపథ్యంలో గ్రీన్‌హౌస్ ద్వారా అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.
 
పబ్లిక్ గార్డెన్‌లో ప్రయోగం సక్సెస్
వాస్తవంగా గ్రీన్‌హౌస్‌లో పూలు, కూరగాయల సాగు చేపడతారు. దేశ, విదేశాల్లోనూ ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఉల్లి కొరత నేపథ్యంలో తెలంగాణ ఉద్యానశా ఖ ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల పబ్లి క్ గార్డెన్‌లో ఒక గ్రీన్‌హౌస్ నిర్మించి అందులో 50 ఉల్లి మొక్కలను నాటింది. అందులో ప్రయోగాత్మకంగా చే పట్టిన ఉల్లి సాగు విజయవంతమైంది. ఎకరా గ్రీన్‌హౌస్ సాగులో ఏకంగా 30 మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుబడి వస్తుందని తేలింది. సాధారణంగా బయట క్షేత్రా ల్లో ఉల్లిని పండిస్తే కేవలం ఏడు మెట్రిక్ టన్నుల మేర కే దిగుబడి వస్తుంది. గ్రీన్‌హౌస్‌లో ఉల్లి సాగు వల్ల నాలుగింతల దిగుబడి వస్తుందని ప్రయోగం లో తేలడంతో రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన రైతు వెంకటేశ్వరరెడ్డిని ఉద్యానశాఖ సంప్రదిం చింది. అర ఎకరం భూ మిలో ఆ రైతు ఉల్లి సాగు చేపట్టారు. 75 వేల మొక్కలు నాటారు.
 
70 రోజుల్లో ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం
సాధారణంగా ఉల్లి పంట 110 రోజులకు దిగుబడి వస్తుంది. అలాంటిది గ్రీన్‌హౌస్‌లో 70 రోజులకే పంట చేతికి వస్తుంది. సాధారణం కంటే నాలుగింతల దిగుబడి రానుండటంతో ఎకరాకు రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతుందని ఉద్యానశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కీసర రైతు అర ఎకరానికిగాను రూ. 3 లక్షల ఆదాయం పొందుతారని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వెంటనే కొత్తమీర, దోసకాయ, క్యాప్సికం సాగు చేయాలని అధికారులు అతనికి సూచించారు. ఆ ప్రకారం ఏడాదికి అర ఎకరా భూమిలో కనీసంగా రూ. 10 లక్షల వరకు  ఆదాయం పొందుతారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గ్రీన్‌హౌస్ ద్వారా మూడు నాలుగు పంటలు ఏడాదికి వేసే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement