మా అబ్బాయికి వరుడు కావలెను
‘మా అబ్బాయికి వరుడు కావాలి. జంతు ప్రేమికుడై ఉండాలి. శాఖాహారి, 25 నుంచి 40 ఏళ్ల మధ ్య ఉండాలి. కుల పట్టింపులేం లేవు. ఏ కులం అయినా ఫర్వాలేదు (అయ్యర్‌లకు ప్రాధాన్యం)’ ఇది ఓ తల్లి ఇచ్చిన వివాహ ప్రకటన. పొరపాటున ఇలా ఇచ్చిందని అనుకుంటున్నారేమో.. అలాంటిదేమీ లేదండీ బాబూ..కొడుకు స్వలింగ సంపర్కుడు(గే) కావడంతోనే ఆ తల్లి ఇలా వార్తా పత్రికలో వివాహ ప్రకటన ఇచ్చింది. అసలు విషయమేమంటే.. ముంబైలో నివసించే పద్మ కుమారుడు హరీశ్ అయ్యర్(36) ఒక స్వలింగ సంపర్కుడు.
హరీశ్ ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. కొడుకు ఓ గే అనే సంగతి తెలుసుకున్న తల్లి.. కొడుకు ఇష్టానుసారమే పెళ్లిచేయాలనుకుంది. దీంతో మంగళవారం ముంబైలోని ఓ వార్తా పత్రికలో ‘వరుడు కావలెను’ అంటూ ఇలా అడ్వటైజ్‌మెంట్ ఇచ్చేసింది. ఈ తరహా యాడ్ దేశంలోనే తొలిసారి కావడంతో, సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది. దీంతో ఆ తల్లికి వేల సంఖ్యలో ఫోన్లు వచ్చాయి. యునెటైడ్ వే ఆఫ్ ముంబై అనే ఎన్జీవో సంస్థను హరీశ్ నడుపుతున్నాడు. 2013లో వరల్డ్ ప్రైడ్ పవర్ లిస్ట్‌లో 71వ స్థానంలో ఆ సంస్థ నిలిచింది.