జీఎస్‌టీ ఎఫెక్ట్: విదేశీ మొబైల్ మేకర్లకు షాక్!
న్యూఢిల్లీ. స్వదేశీ మొబైల్ ఉత్పత్తిదారులను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. విదేశీ స్మార్ట్‌ఫోన్ల దిగుమతులపై దిగుమతి సుంకాన్ని విధించనుంది. త్వరలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ) అమల్లోకి రానున్న సందర్భంగా దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకం విధించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుమారు 5-10శాతం టాక్స్ విధించేందుకు యోచిస్తోంది.
ఫలితంగా విదేశీ మొబైల్ ఫోన్ల ధరలు భారీగా పెరగనుండగా, స్వదేశీ డివైస్‌లు వినియోగదారులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా చైనా స్మార్ట్‌ఫోన్లకు చెక్ పెట్టి, ఇండియాలో ఆపిల్ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా సర్కార్ ఆలోచిస్తోంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అటార్నీ జనరల్ నుండి చట్టపరమైన అభిప్రాయం పొందింది. అంతేకాదు ఈ విధమైన కస్టమ్స్ సుంకం విధింపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒప్పందం (ఐటీఏ) అంతర్జాతీయ ఒప్పందం ఉల్లంఘన కాదని అటార్నీ జనరల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు ఫైనాన్స్, వాణిజ్యం, టెలికాం, ఐటి మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేశారు.
మరోవైపు దేశీయ హ్యాండ్ సెట్ తయారీదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని మినహాయింపులకు అదనంగా మరో ప్రయోజనాన్ని కూడా అందించనుంది. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ భాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేయనుంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తరువాత ఈ నిర్ణయం అమలుకానుంది.