
జీఎస్టీ వల్ల రైతులపై పెనుభారం
వ్యవసాయంలో కీలకమైన ట్రాక్టర్ల మీద పన్ను, బ్యాంకుల్లో సేవా పన్నుతో రైతులపై జీఎస్టీ భారంగా మారుతుందని అసెంబ్లీలో కాంగ్రెస్ లిజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ)నేత జానారెడ్డి విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో కీలకమైన ట్రాక్టర్ల మీద పన్ను, బ్యాంకుల్లో సేవా పన్నుతో రైతులపై జీఎస్టీ భారంగా మారుతుందని అసెంబ్లీలో కాంగ్రెస్ లిజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ)నేత జానారెడ్డి విమర్శించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీఎల్పీ ఉపనేతలు జీవన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
రైతులపై భారం వల్ల వ్యవసాయంపై ఆసక్తి తగ్గే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ హామీ ప్రకటనలకే పరిమితమైందని, రుణమాఫీ కాక రైతులు ఇంకా రుణగ్రస్తులుగానే ఉన్నారని పేర్కొన్నారు. బ్యాంకుల్లో రైతుల ఖాతాల్లో ఉన్న డబ్బులనూ వారికి అందించలేదని, రైతులపై వడ్డీ భారం అలాగే ఉందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు గులాబీ రంగులు వేస్తున్నారని, కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని టీఆర్‌ఎస్ పార్టీ రంగులతో దాచలేరని ఎద్దేవా చేశారు.