వాషింగ్టన్: ఒక వ్యాధి మందుతో మరొక ప్రయోజనం కూడా ఉంటే.. ఆ మందు అమృతమే కదా! అమెరికాలో అలాంటి ప్రయోగమే చేసిన శాస్త్రజ్ఞులు విజయవంతంగా బట్టతలపై జుట్టు మొలిపించారు. వైద్యానికి అందని జబ్బుతో బాధపడుతూ వంటిపై వెంట్రుకలన్నీ కోల్పోయిన 25 ఏళ్ల యువకుడికి.. కీళ్లవ్యాధి (ఆర్థరైటిస్)కి వాడే మందుతో జుట్టు పెరిగేలా చేశారు. ప్రస్తుతం అలోపేసియా యునివర్సిలిస్ (జుట్టు రాలిపోవడం) వ్యాధికి శాశ్వతంగా కానీ, దీర్ఘకాలంలో కానీ నివారణకు మందులు లేవని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇలాంటి వ్యాధిగ్రస్థుడికి మొట్టమొదటగా వెంట్రుకలు తిరిగి వచ్చిన ఘటన ఇదేనని వారు తెలిపారు.
తాము ట్రీట్‌మెంట్ చేసిన యువకుడికి అలోపేసియాతో పాటు సొరియాసిస్ వ్యాధి కూడా ఉందని, సొరియాసిస్‌కు వైద్యం కోసం తమ వర్సిటీకి వచ్చాడని యలే వర్సిటీ మెడిసిన్ స్కూల్‌లో డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రెట్ కింగ్ చెప్పారు. కీళ్లవ్యాధికి వాడే టోఫాసిటినిబ్ సిట్రేట్ అనే మందుతో సొరియాసిస్‌కు వైద్యం ప్రారంభించామని, అలోపేసియాకు కూడా అదే మందు మోతాదులో మార్పులు చేసి వినియోగించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. రెండు నెలల పాటు ఆ మందును 10 మిల్లీ గ్రాముల చొప్పున ఇవ్వగా జుట్టు పెరుగుదల కనబడిందని, తర్వాత మూడు నెలల పాటు 15 మిల్లీగ్రాముల ఇవ్వగా పూర్తి స్థాయిలో జుట్టు మొలకెత్తిందని చెప్పారు.
కీళ్ల వ్యాధి మందుతో బట్టతలపై జుట్టు
Published Sat, Jun 21 2014 1:17 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
Advertisement