వారి కారణంగానే ఓడిపోయాం: కెప్టెన్‌ స్మిత్‌ | Hard defeat to swallow, says Steve Smith | Sakshi
Sakshi News home page

వారి కారణంగానే ఓడిపోయాం: కెప్టెన్‌ స్మిత్‌

Published Mon, May 22 2017 9:27 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

వారి కారణంగానే ఓడిపోయాం: కెప్టెన్‌ స్మిత్‌

వారి కారణంగానే ఓడిపోయాం: కెప్టెన్‌ స్మిత్‌

ఆదివారం నాటి ఫైనల్‌ మ్యాచ్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ జట్టును చివరివరకు విజయం ఊరించింది. చివరి ఐదు ఓవర్లలో 47 పరుగులు చేస్తే ఆ జట్టు తొలి ఐపీఎల్‌ టైటిల్‌ వరించేది. చేతిలో ఎనిమిది వికెట్లు సైతం ఉన్నాయి. ఈ దశలో పుణె విజయం ఖాయమని అంతా భావించారు. కానీ, చివరివరకు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో పుణె జట్టు ఆశలు అడియాసలయ్యాయి. చివరివరకు క్రీజ్‌లో ఉండి 51 పరుగులు చేసినప్పటికీ జట్టుకు విజయాన్నిందించలేకపోయిన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మ్యాచ్‌ అనంతరం ఒకింత నిర్వేదంగా మాట్లాడాడు. ఈ పరాజయాన్ని దిగమింగుకోవడం చాలా కష్టమని చెప్పాడు. అయితే, టోర్నమెంటు మొత్తం తమ ఆటగాళ్లు చక్కని ఆటతీరు ప్రదర్శించడం గర్వంగా ఉందని చెప్పాడు. 129 పరుగులు భారీ లక్ష్యమేమీ కాదని, కానీ ఈ వికెట్‌ మీద పరుగులు రాబట్టడం కష్టంగా మారిందని, అందువల్లే గెలుపునకు దూరమయ్యామని చెప్పాడు.

తమ ఓటమికి ముంబై బౌలర్లే ప్రధాన కారణమని స్మిత్‌ అంగీకరించాడు. పరుగులు చేయకుండా తమ బ్యాట్స్‌మెన్‌ను ముంబై బౌలర్లు నిలువరించారని, అదే మ్యాచ్‌ గతిని మార్చేసిందని చెప్పాడు. ‘మా చేతిలో వికెట్లు ఉన్నాయి. ఒకటి, రెండు మంచి ఓవర్లు పడితే చాలు మ్యాచ్‌ మా చేతిలోకి వచ్చేది. కానీ, వాళ్లు (బౌలర్లు) అద్భుతంగా ఆడి.. మమ్మల్ని నిలువరించారు’ అని అన్నాడు. ఐపీఎల్‌లో ఆడటం చాలా అద్భుతంగా ఉందని, గత రెండేళ్ల కాలంలో ఐపీఎల్‌లో ఆడటం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని స్మిత్‌ చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement