
హైదరాబాద్‌పై మాట్లాడటానికి మీరెవరు?: హరీష్‌రావు
సిద్దిపేట, న్యూస్‌లైన్: ‘హైదరాబాద్‌పై మాట్లాడటానికి మీరెవరు..? ఏ హోదాలో ఉదారతను ప్రకటిస్తున్నారు.. ఎవరిని అడిగి ప్రతిపాదిస్తున్నారు?’అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత టి.హరీష్‌రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా అంగీకరిస్తామంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకు లు పేర్కొనడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సీమాంధ్ర అధికారిక కార్యకలాపాలకు మాత్రమే భాగ్యనగరాన్ని రాజధానిగా పరిమితం చేయాలని డిమాం డ్ చేశారు.
రాబడి, శాంతిభద్రతలవంటివన్నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో ఉండాల్సిందేనని చెప్పారు. హెచ్‌ఎండీఏను కేంద్రం పరిధిలోకి తేవడమంటే తెలంగాణలోని సగం జిల్లాలను విడదీసినట్లేనని, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలను వెంటనే మానుకోవాలన్నారు.
వారిని సస్పెండ్ చేసే దమ్ముందా?: చంద్రబాబుకు కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తమది క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలపై చర్యలు తీసుకునే ధైర్యం ఎందుకు చేయడం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారక రామారావు ప్రశ్నించారు. టీడీపీ విధానం తెలంగాణకు అనుకూలమని చెబుతున్న చంద్రబాబు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేస్తున్న ప్రజాప్రతినిధులతో పాటు నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విభజనకు అంగీకరించిన చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడం ఏమిటన్నారు. ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేని అర్భకుడు సీఎం కిరణ్ అని. ఆయనకు దమ్ముంటే కేసీఆర్ విసిరిన సవాల్‌కు స్పందించాలని కోరారు. తెలంగాణవాదులపై సంస్కారహీనంగా వ్యవహరిస్తున్న వారితో ఎలా కలిసుండాలని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న దీక్ష గురించి విలేకరులు ప్రస్తావించగా... వేరే రాష్ర్టంలో జరుగుతున్న దీక్ష గురించి తామెందుకు మాట్లాడాలని చెప్పారు.
హరికృష్ణా.. ఎన్టీఆర్ ఇప్పుడే గుర్తుకొచ్చారా?: కడియం
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావును సీఎం పదవి నుంచి దించేటప్పుడు అందులో భాగస్వామి అయిన హరికృష్ణకు ఇన్నాళ్లకు తండ్రి గుర్తుకొచ్చినట్టున్నారని టీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడూ చేసేప్పుడు తమతోనే ఉన్న హరికృష్ణ ఆనాడు నోరెత్తి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన టీఆర్‌ఎస్ నేతలు బి.వినోద్‌కుమార్, రమణాచారిలతో కలసి విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు బావమరిది ఎన్టీఆర్ సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసినప్పటికీ టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాత్రం తమ పార్టీది తెలంగాణ అనుకూల వైఖరి అని చెప్పడం వింతగా ఉందన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవడంపై శ్రీహరి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంపై ఈ స్థితిలోనే ఒత్తిడి చేయలేని కాంగ్రెస్ నేతలు రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల మనోభావాలను ఎలా గౌరవిస్తారని సందేహం వ్యక్తం చేశారు. ఈనెలాఖరులో కరీంనగర్ నుంచి కేసీఆర్ పర్యటన ప్రారంభం కానుందని చెప్పారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర పాలిత ప్రాంతం అనేది హైదరాబాద్‌కు నప్పదని తెలిపారు. దిగ్విజయ్‌సింగ్ సైతం ఇదే విషయాన్ని చెప్పారని గుర్తుచేశారు.