‘మోదీ మాతో ఏం చేయిస్తున్నాడో ఏంటో?’
చండీగఢ్: హరియాణాలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్ర సామాజిక న్యాయమంత్రి కృషాన్ కుమార్ బేడీతో పెద్ద తలనొప్పే వచ్చిపడింది. బేడీ ఆదివారం ఫతేహాబాద్‌లో నిర్వహించిన ‘స్వచ్ఛభారత్’ ప్రచారంలో పాల్గొన్నారు. చీపురు పట్టి ఊడుస్తూ... ‘మా చేత మోదీ ఏమేం చేయిస్తున్నాడో అర్థం కావడం లేదు’ అని అన్నారు.
దీంతో అక్కడున్న వారు నవ్వేశారు. అన్ని మాధ్యమాల్లో వీడియో పాకేసింది. ఆయన్ను దీనిపై వివరణ కోరగా... ‘మోదీ చెప్పారన్న కారణంతో కొంత మంది అధికారులు బలవంతంగా చీపుర్లు పడుతున్నారే తప్ప వారిలో చిత్తశుద్ధి లేదన్నది నా దృష్టికి వచ్చింది. ఈ ధోరణి పోయి హరియాణా అంతా పరిశుభ్రంగానే కాదు, సంపూర్ణ ఆరోగ్యంగా కూడా ఉండాలన్న కోణంలోనే నేనలా మాట్లాడా’ అని బదులిచ్చారు.