మంత్రిగారికి చుక్కలు చూపించిన మహిళా అధికారి | Who won this Haryana politician vs woman police officer spat? | Sakshi
Sakshi News home page

మంత్రిగారికి చుక్కలు చూపించిన మహిళా అధికారి

Published Sat, Nov 28 2015 1:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మంత్రిగారికి చుక్కలు చూపించిన మహిళా అధికారి - Sakshi

మంత్రిగారికి చుక్కలు చూపించిన మహిళా అధికారి

చండీగడ్ :  హర్యానా ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ అధ్యక్షతన జరిగిన గ్రీవియన్స్ అండ్ అంబాలా పబ్లిక్ రిలేషన్స్  కమిటీ  సమావేశం రసాభాసగా మారడం చర్చనీయాంశమైంది.  ఈ సందర్భంగా ఓ మహిళా పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించి ఆయన వివాదంలో ఇరుక్కున్నారు.  అంబాలా జిల్లాలో జరిగిన  పబ్లిక్ రిలేషన్స్  కమిటీ  సమావేశం  సందర్భంగా  డీఎస్పీ  సంగీతా కాలియాపై  గెట్ అవుట్ అంటూ విరుచుకుపడ్డారు.  అంతేకాకుండా డిప్యూటీ కమిషనర్ ఎన్‌కే సోలంకిపై అభ్యంతరకరమైన రీతిలో ఘర్షణకు దిగి తన  ప్రకోపాన్ని ప్రదర్శించారు.  

వివరాల్లోకి వెళితే..   శుక్రవారం ఫతేబాద్ గ్రీవియన్స్ అండ్ అంబాలా పబ్లిక్ రిలేషన్స్  కమిటీ  సమావేశానికి మంత్రి అనిల్ విజ్ హాజరయ్యారు. తమ తమ ఫిర్యాదులతో  వచ్చిన  జనంతో  అక్కడంతా కోలాహలంగా ఉంది.  ఇంతలో  అక్రమ మద్యం అమ్మకాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన డీఎస్పీ సంగీతా కాలియా...  అక్రమ మద్యాన్ని నిరోధించడానికి  తాము  చేయాల్సిందంతా చేస్తున్నామన్నారు.  గత పదినెల  కాలంలో  సుమారు 2500 కేసులు నమోదు చేశామని, ఇదొక  రికార్డని సమాధానం ఇచ్చారు.  అయితే ఆమె సమాధానంపై సంతృప్తి చెందని మంత్రి గారు విరుచుకుపడ్డారు. ఒకదశలో గెట్ అవుట్ అంటూ ఆవేశంతో ఊగిపోయారు.

 

అయినా మహిళా పోలీసు అధికారి..  మంత్రి  ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. తానేమీ తప్పు చేయలేదని వాదించారు. దీంతో ఇద్దరి మధ్యా కాసేపు వాగ్వాదం చెలరేగింది. అయినా సంగీత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విధి నిర్వహణలో  తాము సక్రమంగానే ఉన్నామంటూ  స్పష్టం చేశారు. దీంతో  అసహనానికి గురైన మంత్రి  అనిల్  సహచరులు, కమిటీ సభ్యులు సహా సమావేశం నుంచి  బైటికి వెళ్ళిపోయారు. అనంతరం డిప్యూటీ కమిషనర్  మీటింగ్ను కొనసాగించారు.

అయితే ఈ ఆరోపణలను మంత్రి అనిల్ విజ్  ఖండించారు. డిఎస్పీ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించిందనీ, అందుకే  మంత్రిగా తాను అలా  ప్రవర్తించాల్సి వచ్చిందంటూ తన వైఖరిని సమర్ధించుకున్నారు.  సక్రమంగా పని చేయని  ప్రభుత్వ అధికారులపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.  ఫిర్యాదులు చేయడానికి వచ్చిన కొంతమంది సభ్యులను అడ్డుకుంటుంటే తాను వారించానంటూ వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై  ముఖ్యమంత్రికి,  డీజీపికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement