విద్యార్థినులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
కోల్ కతా: పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విద్యార్థినులపై అసభ్యకరంగా సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. జాదవ్ పూర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్లంతా తక్కువ స్థాయివారని, సిగ్గులేనివారంటూ వ్యాఖ్యానించారు. ఎప్పుడు వాళ్లు అబ్బాయిల తోడు కావాలని వెతుక్కుంటారంటూ చెప్పారు. ఈ వర్సిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏబీవీపీ వారు తమను లైంగిక వేధింపులకు గురి చేశారని వామపక్ష విద్యార్థి సంఘం విద్యార్థినులు ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి వివాదంలో కూరుకుపోయారు.
'లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చేసే వ్యాఖ్యలు ఆధారం లేనివి. జాదవ్ పూర్ యూనివర్సిటీలో ఇలాంటి ఆరోపణలు చేస్తున్న విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో.. వారికి వారు తక్కువ స్థాయివారు. సిగ్గులేనివారు. వాళ్లెప్పుడు అబ్బాయిల సాంగత్యం కోరుకునేందుకు వెతుకుతుంటారు' అని ఆయన చెప్పారు. ఎవరికైనా ప్రజాస్వామ్య బద్ధంగా తమ నిరసనల తెలిపే అవకాశం ఉందని, అయితే, ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదని చెప్పారు. కాగా, ఈ వ్యాఖ్యలపట్ల విద్యార్థినులు స్పందిస్తూ ఒక మతతత్వ భావజాలాన్ని నింపుకున్న పార్టీ నుంచి ఇంతకంటే మంచి మాటలు వస్తాయని తాము కూడా ఆశించడం లేదని పరోక్షంగా విమర్శించారు. ఆయన వెంటనే ఇలాంటి మాటలపట్ల క్షమాపణలు చెప్పాలని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.