
సాక్షి,రాయ్‌పూర్: పార్లమెంట్ సభ్యుడిగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఆ ఎంపీ.. బాలికలపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన ఎంపీ తీరు వివాదాస్పదమైంది. చత్తీస్‌గఢ్ బీజేపీ ఎంపీ బన్సీలాల్ మహతో ఆ రాష్ట్ర బాలికలపై చేసిన లైంగిక వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆయన అసభ్య వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చత్తీస్‌గఢ్ బాలికలు, యువతులు రెచ్చగొట్టేలా ఉంటారని ఆ వీడియోలో మహతో మాట్లాడుతూ కనిపించారు.అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రెజ్లింగ్ పోటీల నేపథ్యంలో మహతో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బీజేపీ నేత మహిళలపై చేసిన లైంగిక వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మహతోపై కఠిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 77 ఏళ్ల మహతో కోర్బా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహతో క్షమాపణ చెప్పాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత టీఎస్ సింగ్ దేవ్ కోరారు. మహతో ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు తాను అక్కడే ఉన్నానని జనతా కాంగ్రెస్ నేత అమిత్ జోగి చెప్పారు. సీనియర్ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం..ఇది బీజేపీ ఆలోచనా ధోరణికి అద్దం పడుతుందని జోగి వ్యాఖ్యానించారు.