తలలు నరుకుతాం
కోలకతా: 'జాతి వ్యతిరేక' వ్యాఖ్యల వివాదం దేశవ్యాప్తంగా రగులుతోంది. ఈ నేపథ్యంలోనే అల్లర్లతో అట్టుడుకుతున్న బీర్‌భూమ్ జిల్లా సియురిలో స్థానిక బీజేపీ నేత అగ్నికి ఆజ్యం పోసే వ్యాఖ్యలతో వివాదాన్ని రగిలించారు. పశ్చిమబెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం లేపారు. ఎవరైనా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే తలలు నరుకుతామంటూ హెచ్చరించి వివాదాన్ని సృష్టించారు. ఇటీవల రగిలిన వివాదానికి నిరసనగా బీర్‌భూమ్‌లో జరుగుతున్న ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పాకిస్తాన్ జిందాబాద్ ' అని ఎవరైనా నినదిస్తే పైనుంచి 6 అంగుళాలు మేర కత్తిరించి పారేస్తామని హెచ్చరించారు.
సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్‌లో 'అభ్యంతరకరమైన' పోస్ట్ పెట్టడంతో మంగళవారం బీర్‌భూమ్‌లో ఘర్షణలు చెలరేగాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ పై దాడిచేశారు. కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. ఫేస్బుక్ లో ఈ కామెంట్ పెట్టిన విద్యార్థి సుజన్ ముఖర్జీ ఇంటిముందు కొంతమంది ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.