మృతుడి తల్లి గంగులమ్మ, అన్న లక్ష్మీనారాయణను విచారిస్తున్న సీఐ శ్రీనివాసులు
మదనపల్లె: కనుమ పండుగ సంబరాల నేపథ్యంలో గొర్రె తల నరకడానికి బయలుదేరిన ఓ వ్యక్తి మద్యం మత్తులో క్షణికావేశానికి గురై వరుసకు తమ్ముడయ్యే యువకుడి మెడ నరికి హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం వలసపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వందలాదిమంది చూస్తుండగానే చోటుచేసుకున్న ఈ ఘటనలో తల తెగిన యువకుడు మరణించగా.. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె రూరల్ సీఐ శ్రీనివాసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వలసపల్లె గ్రామానికి చెందిన తలారి లక్ష్మన్న, గంగులమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. భర్త లక్ష్మన్న ఎనిమిదేళ్ల క్రితం చనిపోగా పెద్ద కుమారుడు రాయలపేటలో కేబుల్ పని చేసుకుంటుండగా, రెండో కుమారుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
మూడో కుమారుడైన తలారి సురేష్ (26) అవివాహితుడు కావడంతో కూలి పనులు చేసుకుంటూ తల్లి వద్దే ఉంటున్నాడు. సురేష్‌కు వరుసకు పెదనాన్న కుమారుడైన తలారి చలపతి (55) కుటుంబం కూడా అదే గ్రామంలో ఉంటోంది. ఆ రెండు కుటుంబాల మధ్య చాలాకాలంగా స్వల్ప వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా, గ్రామంలో జరిగే కనుమ ఉత్సవాల్లో అమ్మవారికి జంతు బలులు ఇచ్చేటప్పుడు ఏటా తలారి చలపతి గొర్రె తల నరకడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గ్రామమంతా కనుమ సంబరాల్లో హడావుడిగా ఉంది. గ్రామస్తులు రామాలయం నడి వీధిలో ఏర్పాటు చేసిన మండపం వద్ద అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ పూజలు చేయడంలో నిమగ్నమయ్యారు.
మద్యం మత్తులో ఘాతుకం
కాగా, తలారి సురేష్, అతడి పెదనాన్న కుమారుడు తలారి చలపతి ఆదివారం ఉదయం నుంచీ మద్యం మత్తులో తూగుతున్నారు. సంబరాల్లో భాగంగా అమ్మవారికి బలిచ్చే గొర్రెను మేళతాళాల మధ్య గ్రామంలో ఊరేగింపుగా ఇంటింటికీ తీసుకెళ్లి పూజలు చేయిస్తూ నడివీధికి తీసుకురావడం ఆనవాయితీ. ఈ క్రమంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సురేష్ డప్పు వాయిద్యాలకు అనుగుణంగా డ్యాన్సులు వేస్తూ గొర్రె వెంట బయలుదేరాడు. తలారి చలపతి చేతితో వేట కొడవలి పట్టుకుని గొర్రెతోపాటు నడుస్తుండగా రెండుమూడుసార్లు సురేష్ అతడిపై తూలిపడ్డాడు. ఆగ్రహించిన చలపతి అమ్మవారి గొర్రెకు చందాలు ఇచ్చే స్తోమత లేదు కానీ డ్యాన్సులు వేసేందుకు తక్కువ లేదంటూ విసుక్కున్నాడు.
ఈ క్రమంలో ఇద్దరిమధ్యా చిన్నపాటి గొడవ జరిగింది. చలపతి డప్పుల వారిని నిలిపేయాల్సిందిగా ఆదేశించడంతో తాను డ్యాన్సు వేయాల్సిందేనని సురేష్ పట్టుపట్టాడు. దీంతో చలపతి ఆగ్రహానికి గురై చేతిలో ఉన్న వేట కొడవలితో ఒక్క ఉదుటున సురేష్ మెడపై నరికాడు. మెడ సగ భాగం వరకు తెగిపోయింది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి గ్రామస్తులు భయకంపితులై ఇళ్లల్లోకి పరుగులు తీసి తలుపులు వేసుకున్నారు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న సురేష్‌ను గ్రామస్తులు 108 అంబులెన్స్‌లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విపరీతమైన రక్తస్రావం కావడంతో అప్పటికే సురేష్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment