
నేడు, రేపు వడగాడ్పులు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో పలుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఒకటి రెండు చోట్ల వడగాల్పులు ఉంటాయని తెలిపింది. ఆ ప్రాంతంలో పలు చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.
మిగతా చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించే ఉంటాయని వెల్లడించింది. శనివారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, నిజామాబాద్, మెదక్‌లలో 42 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వడదెబ్బతో 17 మంది మృతి
సాక్షి, నెట్‌వర్క్: మండుతున్న ఎండలకు రైతులు, కూలీలు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బతో శనివారం రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల 17 మంది మృతి చెందారు. మృతుల్లో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఎన్‌జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు బూడిద ముత్యాలు(70), ఇదే మండలానికి చెందిన రైతు మామిడి ముత్తయ్య (60), దేవరకొండ మండలం పర్షా్య తండాకు చెందిన ఉపాధిహామీ కూలీ నేనావత్ దశరథ్ (50), సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రానికి చెందిన మాలోతు సైదులు(32), కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన మేస్త్రీ దిగుల్ల ఓదెలు(55), జగిత్యాల జిల్లాకు చెందిన పొలాస కమల(75), సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన జె.కిష్టమ్మ(35), సిద్దిపేట మండలానికి చెందిన రైతు కూస శ్రీనివాస్ (37), రామాయంపేట మండలాని చెందిన రైతు నెనావత్ నగ్యా నాయక్ (62 ), చేగుంట మండలంలోని పొలంపల్లిలో రైతు గరిగె అంజయ్య(55), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలానికి చెందిన యశోదమ్మ(75), తల్లాడ మండల కేంద్రానికి చెందిన అక్కల రాంరెడ్డి(94), ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడుకు చెందిన వంగూరి రాంబాయమ్మ(65), మహబూబాబాద్ జిల్లా నడవాడ గ్రామ పరిధి రంగశాయిపేటకు చెందిన కూలీ బంది సురేష్(30), వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన గీత కార్మికుడు వేముల ఐలయ్య(78), వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లికి చెందిన రాజ్‌కుమార్, ఇదే జిల్లా ఐనవోలు మండలం పున్నేలుకు చెందిన ఎం.డి.సాహెబీ(60) ఉన్నారు.