వెంబ్లే స్టేడియంలో గీతాలు ఆలపిస్తున్న పాప్ సింగర్లు జాన్ సేన్, అలీషా చినాయ్
లండన్: 'దేఖీహై సారీ దునియా.. జపాన్ సె లేకే రష్యా.. ఆస్ట్రేలియా సే లేకే అమెరికా.. మేడిన్ ఇండియా.. మేడిన్ ఇండియా.. ఎక్ దిల్ చాహియే బస్ మేడిన్ ఇండియా..' అంటూ ఇండిపాప్ సింగర్ అలీషా చినాయ్ ఆలపించిన గీతానికి దాదాపు 60 వేల మంది శ్రోతలు కదంకలుపుతూ వంతపాడారు. మరో సింగర్ జాన్ సేన్ (కమల్జిత్ సింగ్ జ్యోతి) వినిపించిన ర్యాప్ జడిలో ఓలలాడారు. ఇదంతా ఏ మ్యూజిక్ ఫంక్షనో అవార్డ్ సెర్మనీనో అనుకుంటే పోరపాటే!
అవును, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న సభావేదిక లండన్ లోని వెంబ్లే స్టేడియంలో తాజా దృశ్యాలివి. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పలువురు కాళాకారుల ప్రదర్శనలతోపాటు అద్భుతమైన లైటింగ్ తో సాస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నారు. మరి కొద్ది నిమిషాల్లో మోదీ ఇక్కడి ప్రధాన వేదిక నుంచి ప్రసంగించనున్నారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం గురువారం లండన్ కు చేరుకున్న నరేంద్ర మోదీ.. ఇంగ్లాండ్ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. క్వీన్ ఎలిజబెత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అరుదైన బహుమతులు అందజేశారు. శుక్రవారం రాత్రి వెంబ్లే స్టేడియంలో ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇంగ్లాండ్ లోని 1500 ప్రాంతాల నుంచి దాదాపు 60 వేల మంది ఎన్నారైలు ఇప్పటికే స్టేడియం వద్దకు చేరుకున్నారు. స్థానిక రాజకీయనేతలు సైతం ఆశ్యర్యానికి లోనయ్యేలా మోదీ సభకు పెద్ద ఎత్తున జనం హాజరుకావడం విశేషం. గతంలో అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ మోదీ ఇలా 'రాక్ స్టార్' తరహా సభల్లో పాల్గొనడం గమనార్హం.