ఆ మూడు జిల్లాల్లో ఎడతెగని కరువు
- రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల దుస్థితి
- తెలంగాణలో గడచిన 21 ఏళ్లలో 15 ఏళ్లు కరువే
- కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక
- 1995 నుంచి రాష్ట్రంలో వరస కరువులు
- దేశంలో మూడో అత్యంత కరువు పీడిత రాష్ట్రం తెలంగాణే.. తాజాగా 231 మండలాలపై ప్రభావం
- జాతీయ విపత్తుల ఉపశమన నిధి నుంచి 2,514 కోట్ల రూపాయలు ఇవ్వండి
- ఇందులో రూ. 781.98 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీకి.. రూ. 916.47 కోట్లు కరువు పింఛన్లకు..
- ‘ఉపాధి’ పని దినాలను 150కి పెంచాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు రక్కసి విలయ తాండవం చేస్తోంది. గుక్కెడు నీటికి దిక్కులేకుండా చేసి కరాళ నృత్యం చేస్తోంది. గడచిన 21 ఏళ్లలో ఏకంగా 15 ఏళ్లు రాష్ట్రాన్ని కబళిస్తూ వచ్చింది. రైతుల ఆత్మహత్యలకు.. పంట నష్టాలకు.. ఆకలి చావులకు.. నీటి జగడాలకు.. చివరికి పశుగ్రాసానికీ దిక్కులేకుండా చేసింది. ఈసారీ పంజా విసిరి జనం ప్రాణాలతో చెలగాటమాడుతోంది. 1998-99, 2005-06, 2007-08, 2008-09, 2013-14, 2014-15 సంవత్సరాలను మినహాయిస్తే... 1995-96 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ భూభాగంపై వరసగా కరువు కాటకాలు విజృంభిస్తూనే ఉన్నాయి.
రాష్ట్రంలో నీటి పారుదల సౌకర్యం పెద్దగా లేకపోవడంతో... రైతులు వర్షాధార పంటలే సాగు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలే తెలంగాణకు ప్రధాన దిక్కు. 9వ ప్రపంచ వ్యవసాయ గణాంకాలు-2010-11 ప్రకారం రాష్ట్రంలో 55.5 లక్షల కమతాలుండగా.. అందులో 85.85 శాతం చిన్న, సన్నకారు రైతులవే. వరస కరువులతో వారు దెబ్బతింటూనే ఉన్నారు. ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులే నెలకొనడంతో దేశంలో రాజస్తాన్, కర్ణాటక తర్వాత మిగతా మూడో అత్యంత కరువు పీడిత రాష్ట్రంగా తెలంగాణ నమోదైంది. రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల్లో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలైతే.. ఎడతెగని కరువు ప్రాంతాలుగా తయారయ్యాయి. ఈ విస్మయకర అంశాలను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించింది.
రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఇటీవల కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఈ అంశాలన్నింటినీ అంశాలను పొందుపరిచింది. ఆ నివేదికను ‘సాక్షి’ సంపాదించింది. అందులోని పలు ముఖ్యాంశాలు...
- వడగళ్ల వానల వల్ల 2015 ఫిబ్రవరి-మే నెలల మధ్య అన్ని జిల్లాల్లో సాగులో ఉన్న పంటలు ధ్వంసమయ్యాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాభావం వల్ల జూలైలో 66 శాతం లోటు, ఆగస్టులో 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పంటల ఎదుగుదల మందగించి దిగుబడి తగ్గిపోయింది. పత్తి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న తదితర వర్షాధార పంటలు బాగా దెబ్బతిన్నాయి. తీవ్ర వర్షాభావంతో రాష్ట్రంలో 7 జిల్లాల పరిధిలోని 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది.
- కరువు నుంచి ఉపశమనం కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. కరువు పీడిత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టాం. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 నుంచి 150కు పెంచి పనులు కల్పించడం, పశుగ్రాసం సాగు, పశువులకు తాగునీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వంట నూనెలు, పప్పుల ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఇప్పటికే రూ. 118.20 కోట్లను ఖర్చు చేయడం జరిగింది.
తీవ్రంగా నష్టపోయిన చిన్న రైతులు
రాష్ట్రంలో కరువు మూలంగా రూ. 2,122.91 కోట్లు విలువ చేసే 12,48,498 టన్నుల పంట దిగుబడులకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులు బాగా నష్టపోయారు. జాతీయ విపత్తుల ఉపశమన నిధి (ఎన్డీఆర్‌ఎఫ్) కింద దిగువ పేర్కొన్న అవసరాల కోసం రాష్ట్రానికి రూ. 2,514.03 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆ వివరాలు...
- రాష్ట్రంలో పంటలు నష్టపోయిన 20,91,859 మంది రైతులకు పెట్టుబడి రాయితీగా రూ. 863 కోట్లు ఇవ్వాలి. అందులో రూ.781.98 కోట్లు కేవలం చిన్న, సన్నకారు రైతులకే.
- పశుగ్రాసం సాగు, పశు వైద్య శిబిరాల నిర్వహణ తదితర ప్రత్యామ్నాయ చర్యల కోసం పశు సంవర్థక శాఖకు రూ. 42.84 కోట్లు అవసరం.
- ట్యాంకర్లు, ప్రైవేటు వాహనాల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా కోసం పల్లెలకు రూ. 102.16 కోట్లు, పట్టణాలకు రూ. 220.55 కోట్ల నిధులు అవసరం.
- ఉపాధి హామీ కింద ఇప్పటికే చాలా మంది కూలీలకు 100 రోజుల పని పూర్తయింది. కరువు నుంచి ఉపశమనం కోసం ఈ పనిదినాల పరిమితిని 100 నుంచి 150 రోజులకు పెంచాలి. ఈ లెక్కన 11 లక్షల కుటుంబాలకు అదనపు పని కల్పించేందుకు రూ. 369 కోట్లు కావాలి.
- కరువు ఫలితంగా సమాజంలో నిస్సహాయ వర్గాలైన వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలు, భూములు లేని వ్యవసాయ కూలీలు తీవ్రంగా ప్రభావితులయ్యారు. వారికి ఉపశమనంగా కరువు పింఛన్ల పంపిణీ కోసం రూ. 916.47 కోట్లు అవసరం.
కొన్నేళ్లుగా కరువు మండలాలు..
సంవత్సరం కరువు మండలాలు
1995-96 15
1996-97 17
1997-98 433
1998-99 -
1999-00 245
2000-01 30
2001-02 406
2002-03 446
2003-04 151
2004-05 399
2005-06 -
2006-07 103
2007-08 -
2008-09 -
2009-10 442
2010-11 6
2011-12 418
2012-13 16
2013-14 -
2014-15 -
2015-16 231