పడకేసిన మన ఊరు-మన కూరగాయల పథకం
అమలు మూన్నాళ్ల ముచ్చటే
అధికారుల మధ్య సమన్వయం కరువు
బీడుగా మారిన పొలాలు
మహబూబ్‌నగర్ వ్యవసాయం/షాద్‌నగర్ రూరల్
ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన మన ఊరు- మన కూరగాయల పథకం మూలనపడింది. హైదరాబాద్ వాసులకు తక్కువ ధరకు కూరగాయలు అందించడంతో పాటు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే, అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు కర్నూలు, అనంతపూర్, కడప, వరంగల్, అదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూరగాయలు దిగుమతి అయ్యేవి. వీటిలో అత్యధికంగా రాయలసీమ జిల్లాల నుంచే దిగుమతి అయ్యేవి. రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమ జిల్లాల నుంచి కూరగాయలు హైదరాబాద్‌కు రావడం పూర్తిగా తగ్గింది.
దీంతో హైదరాబాద్‌లో కొరత తీవ్రంగా ఏర్పడి కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు రైతులను ప్రోత్సహించేందుకు గతేడాది ఆగస్టులో మన ఊరు-మన కూరగాయలు పథకాన్ని ప్రారంభించింది. జిల్లాలోని బాలానగర్, ఫరూక్‌నగర్ మండల్లాలోని 5 గ్రామాల చొప్పున 10 గ్రామాలను ఎంపిక చేసింది. ఒక్కో మండలంలో 100 హెక్టార్ల చొప్పున 200హెక్టార్లలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. అందులో భాగంగా దాదాపు 500 మంది రైతులకు సబ్సిడీపై విత్తనాలు, డ్రిప్ పరికారాలు, ట్రేలు తదితర వనరులను సమకూర్చింది. అంతేకాకుండా మేలైన దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇలా ఒక్కో హెక్టారుకు లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
పథకం అమలుకు బ్రేక్ ?
రైతులు పండించిన పంటలు అమ్మేందుకు ప్రభుత్వం బాలానగర్, షాద్‌నగర్‌లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. మొదట్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిగింది. అమ్మిన వాటికి కూడా డబ్బులు సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేశారు. హైదరాబాద్ కొనుగోలు కేంద్రం నుంచి వచ్చిన వ్యాపారులు కూరగాయలు నాణ్యంగా లేవని తక్కువ ధర చెల్లించేవారు. దీంతో కూరగాయలకు మార్కెట్ ధర కన్నా తక్కువ చెల్లిస్తున్నారని రైతులు అక్కడ అమ్మకాలు జరిపేందుకు నిరాకరించారు. మార్కెట్ ధర కన్నా తక్కువ ధర ఇస్తున్నారని రైతులు.. నాణ్యంగా లేని వాటిని తమకు అంటగడుతున్నారని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వాదిస్తున్నారు. దీంతో ఇరువురి మధ్య తేడాలు వచ్చాయి. దీంతో నెల రోజులు కూడా కొనుగోలు కేంద్రాలు పనిచేయలేదు. కొనుగోలు కేంద్రాలు సరిగా నడవకపోవడంతో ఈ పథకం విఫలమైందని భావించిన ప్రభుత్వం దీనికి బ్రేక్ వేసింది. దీనిపై ఎక్కడా చర్చ లేకపోవడంతో ఈ పథకానికి మంగళం పాడినట్టేనని అధికారులు భావిస్తున్నారు.
‘కూర’ల సాగుకు మంగళం
Published Fri, Aug 14 2015 12:35 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement