
టాక్సీ డ్రైవర్.. ఆస్ట్రేలియన్ ఆఫ్ ద డే
ఆదివారం వస్తోందంటే చాలు.. శనివారం రాత్రి నుంచే హాయిగా రిలాక్స్ అయిపోడానికి ప్రయత్నిస్తాం. కానీ ఓ సాధారణ వ్యక్తి అసాధారణ సేవలను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. నెలలో ఒక ఆదివారం సమాజసేవకు అంకితం అవుతూ.. 'ఆస్ట్రేలియన్ ఆఫ్ ది డే' పేరిట ఓ వినూత్నకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇండియాలో పుట్టి ఆస్ట్రేలియాలోని డర్విన్ లో ఉంటున్న తేజేందర్ సింగ్... అక్కడ కూడు, గూడుకు నోచుకోని నిరుపేదలకు ఆహారం అందిస్తూ ఆపద్బాంధవుడయ్యాడు.
తేజేందర్ సింగ్ ప్రతి ఆదివారం.. ఉదయం ఏడు గంటలకు షిఫ్టు ముగించుకొని ఇంటికి వచ్చే అతడు కిలోల కొద్దీ అన్నం, కూరగాయలను వండుతాడు. అతని కుమారుడు నవదీప్ ఆ ఆహారాన్ని సిటీలోని పేదలకు అందిస్తాడు. మూడేళ్లుగా తేజేందర్ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. మంచి పని చేస్తున్నపుడు తనకు మరింత శక్తి వస్తుందంటున్న అతడు... పగలు ఎయిర్ కండిషనర్ మెకానిక్ గానూ పని చేస్తూ తన సంపాదనను ప్రజాసేవకు వినియోగిస్తున్నాడు.
''సంపాదించిన దానిలో పదిశాతం బీదలకు, దిక్కు లేనివారికి వెచ్చించాలన్నది మా మత ధర్మంలో ఉంది'' అంటున్న తేజేందర్ సింగ్.. ఈ రకమైన సేవ పదిమందీ చేయాలన్న ఉద్దేశంతో.. ఫేస్బుక్ను ప్రచార సాధనంగా ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఆఫ్ ద డే గా గుర్తింపు పొందాడు.
రాత్రంతా టాక్సీ నడిపి, తెల్లవారుతుండగా ఇంటికి చేరే తేజేందర్ తిరిగి పని చేయాలంటే శక్తి అవసరం కాబట్టి ఏదో కాస్త తిని, కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఓపిక కూడదీసుకొని మళ్లీ పనిలో నిమగ్నమైపోతాడు. తేజేందర్ ఎందరికో ఆర్థికంగానూ అండగా నిలుస్తున్నాడు. తాను చేసే సేవకు ఎటువంటి నిధులు, విరాళాలు సేకరించడు. స్వయంగా సంపాదించిన దానిలోనే ఇతరులకు సహాయ పడతాడు. తనలాగా మరెందరో సేవలు అందించగలిగితే మరింత ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నాడు. అందుకు ముందుకు వచ్చేవారు తన వ్యాను, వంట పాత్రలు వినియోగించుకోవచ్చని చెబుతున్నాడు.