- ఆ ప్లాంట్లు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా చూడండి
- ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ గ్రామ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా క్రషర్, తారు ప్లాంట్లు నడుపుతుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీవీ ఇన్‌ఫ్రా, బాలాజీ రోడ్ కన్‌స్ట్రక్షన్స్, శ్రీనివాస్ మెటల్ ఇండస్ట్రీస్, మహ్మద్ ముంతాజ్ హాట్ మిక్స్‌లు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అనుమతులు తీసుకోకుండా క్రషర్, తారు ప్లాంట్లు నడుపుతుంటే ఏం చేస్తున్నారో చెప్పాలంటూ జిల్లా కలెక్టర్, ఆర్‌డీవో, జిల్లా పంచాయతీ అధికారులతోపాటు సీవీ ఇన్‌ఫ్రా తదితర కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గుడిహత్నూర్ గ్రామ పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న తారు, క్రషర్ ప్లాంట్ల వల్ల స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కె.సుదర్శన్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.ఎ.కె.ముఖీద్ వాదనలు వినిపిస్తూ, అనధికార ప్రతివాదులుగా ఉన్న కంపెనీలు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఇతర శాఖల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే తారు, క్రషర్ ప్లాంట్లు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ ప్లాంట్ల వల్ల వ్యవసాయదారులు, సాధారణ ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది.
‘ఫోరెన్సిక్’ ఏర్పాట్లపై కేంద్ర, ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిల్లో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలను ఏర్పాటు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటు న్నారో వివరించా లని కేంద్రంతో పాటు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశిం చింది. ఈ విషయంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఉభయ రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీ సులు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతీ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర, ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలు తప్పనిసరిగా ఉండాలని, అయితే ఏపీలో ఒక్క ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా లేదని, తెలంగాణలో ప్రాంతీయ ల్యాబ్‌లు లేవంటూ హైదరాబా ద్‌కు చెందిన ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగ ళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం పైవిధంగా కేంద్ర, తెలుగు రాష్ట్ర ప్రభుత్వా లను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
క్రషర్, తారు ప్లాంట్లపై హైకోర్టు ఆగ్రహం
Published Thu, Mar 30 2017 4:27 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement
Advertisement