
భూ ఆర్డినెన్స్‌పై రాజ్యసభలో రగడ
సర్కారు ‘ప్రకటన’పై విపక్షాల ఆందోళన
ఆర్డినెన్స్ పునఃజారీపై గ్రామీణాభివృద్ధి సహాయమంత్రి ప్రకటన
తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెల్ లోకి దూసుకెళ్లిన టీఎంసీ, ఎస్‌పీ సభ్యులు
న్యూఢిల్లీ: భూసేకరణపై ఆర్డినెన్స్‌ను పునఃజారీ చేయటంపై గురువారం రాజ్యసభలో వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన ప్రభుత్వానికి ప్రతిపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. భూ సేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు (సవరణ) ఆర్డినెన్స్ - 2015 జారీ చేయటం ద్వారా తక్షణం చట్టం చేయటానికి గల పరిస్థితులపై వివరణ ఇస్తూ ఒక ప్రకటనను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సుదర్శన్‌భగత్ రాజ్యసభకు సమర్పించారు.
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్ ఉదయం సభలో ఉన్నప్పటికీ.. సహాయమంత్రి తన ప్రకటనను సమర్పించటానికి కొద్ది నిమిషాల ముందే వెళ్లిపోయారు. అయితే.. ఈ ప్రకటనను తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ సభ్యులు కూడా లేచి నిరసన తెలపాలంటూ టీఎంసీ నేత డెరెక్ ఓ’బ్రెయిన్ పిలుపునివ్వటం కనిపించింది. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని కొనసాగనివ్వబోమని ఎస్‌పీ సభ్యులు నినాదాలు చేశారు.
వెల్ లో ఆందోళనకు దిగారు. తృణమూల్ సభ్యులు కూడా వారితో జతకలిశారు. టీఎంసీ సభ్యుడు నదీం ఉల్ హక్ అజెండా పత్రం నకలును చింపి విసిరేశారు. భూసేకరణ బిల్లును సభలోకి తీసుకొస్తే దానినీ అలానే చేస్తానని చెప్పారు. గందరగోళం కొనసాగటంతో చైర్మన్ సభ వాయిదా వేశారు. అంతకుముందు గజేంద్ర మృతికి సభ నివాళులు అర్పించింది.