
ఆ విషయంలో ట్రంప్ కంటే హిల్లరీ టాప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రధాన అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా దూసుకుపోతున్నారు. ఆరోపణలు, ఘాటైన విమర్శలు, మాటలయుద్ధంతో ప్రచారాన్ని వేడిక్కిస్తున్నారు. ఈ ఇద్దరిలో విజేత ఎవరన్నదానిపై ప్రపంచ వ్యాప‍్తంగా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికల ఖర్చుకు విరాళాలు సేకరించడంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కంటే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీదే పైచేయి. ట్రంప్తో పోలిస్తే హిల్లరీకి భారీగా విరాళాలు వచ్చాయి.
గత మేలో వెల్లడించిన ఆర్థిక నివేదిక ప్రకారం హిల్లరీ 133 కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు. ఇక డెమొక్రటిక్ నేషనల్ కమిటీతో కలసి మరిన్ని నిధులు సేకరించారు. హిల్లరీ ప్రచార ఖర్చు కోసం మొత్తం 284 కోట్ల రూపాయల నగదు అందుబాటులో ఉంది. ఇక ట్రంప్ విషయానికొస్తే మేనాటికి దాదాపు 21 కోట్ల రూపాయలు మాత్రమే సేకరించగలిగారు. ఆర్థిక నివేదిక ప్రకారం ట్రంప్ వద్ద 9 కోట‍్ల రూపాయల నిధులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
కాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ నామినేషన్ పొందాక విరాళాల సేకరణ కోసం ప్రత్యేక దృష్టిసారించారు. రిపబ్లికన్ నేషనల్ కమిటీతో కలసి రెండు రోజుల్లోనే 85 కోట్ల రూపాయల వరకు విరాళాలు వచ్చినట్టు ఆయన మద్దతుదారులు చెప్పారు. ఇక రిపబ్లిక్ నేషనల్ కమిటీ మేలో 88 కోట్ల రూపాయలు సేకరించింది. ఏప్రిల్లో కూడా ఈ మేరకు విరాళాలు వచ్చాయి. అయితే ఈ విరాళాలకు సంబంధించి అధికారిక సమాచారం లేదు.