హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు!
- పాకిస్థాన్‌లో ఘటన
కరాచీ: పాకిస్థాన్ దక్షిణ సింధూ ప్రావిన్స్‌లో ఓ హిందూ ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. థాట్ట జిల్లా ఘరో పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఆలయంలోని ప్రధాన దేవతావిగ్రహాలను ధ్వంసం చేసి.. సమీపంలో ఉన్న చెత్తకుప్పలో పడేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేశారు. దైవదూషణ, ఉగ్రవాదం అభియోగాల కింద కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు నిందితులను ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.
నెలవారీ పూజాకార్యక్రమాల నిర్వహణ కోసం ఆలయంలో ఏర్పాటుచేస్తున్న సమయంలో శుక్రవారం అర్థరాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి.. ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని, అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఐదుగంటల మధ్య వారు ఆలయంలోని విగ్రహాలను ఎత్తుకెళ్లి ధ్వంసం చేశారని, ఉదయం పూజల కోసం ఆలయానికి వచ్చిన హిందూ భక్తులు ఆలయంలో దేవతామూర్తులు లేకపోవడం దిగ్భ్రాంతపోయరని స్థానిక హిందూ కౌన్సిలర్ లాల్ మహేశ్వరి తెలిపారు. ఆలయ చరిత్రలో ఇలాంటి ఘటన ఇప్పటివరకు జరగలేదని చెప్పారు. ఘరో పట్టణంలో రెండువేలు కుటుంబాలు ఉండగా అందులో మెజారిటీ హిందువులే ఉన్నారు.