
అంబాసిడర్ బ్రాండ్ అమ్మేశారు..
కోలకత్తా: అంబాసిడర్..ఒకపుడు ఈ పేరు వింటేనే.. అదో రాజసం..దర్పం...దశాబ్దం క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన ఈ ఐకానిక్ కారు బ్రాండ్‌ను ఓ విదేశీ కార్ల సంస్థసొంతం చేసుకుంది. దేశీయ కార్ మేకర్ హిందుస్తాన మోటార్స్ అంబాసిడర్ కారు బ్రాండ్ ను ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ప్యుగోట్‌కు విక‍్రయించింది.
ఈ మేరకు సి కె బిర్లా గ్రూప్ యాజమాన్యంలోని హిందూస్థాన్ మోటార్స్ శుక్రవారం రూ .80 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఈ ట్రేడ్ మార్క్ అమ్మకం ద్వారా వచ్చి న ఆదాయాన్ని ఉద్యోగులు , రుణదాతల బకాయిలను క్లియర్ చేయడానికి ఉపయోగించనున్నట్టు సికె బిర్లా గ్రూప్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ప్యుగోట్ ఈ బ్రాండ్ ను ఇండియాలో పునరద్ధరిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.
ఏడు దశాబ్దాల క్రితం అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని హిందుస్తాన్ మోటార్స్ లాంచ్ చేసింది. మోరిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ కి కొద్ది మార్పులు చేసిదీన్ని మార్కెట్ లో ప్రవేశపెట్టింది. 1960 -70 దశకాల్లో ఒక వెలుగు వెలిగింది. భారత రోడ్లపై అంబాసిడర్ వాహనాల ఆధిపత్యం కొనసాగింది. దాదాపు 1980లో మారుతి 800 రాక అంబాసిడర్‌కు భారీ దెబ్బ తగిలింది. ఎంతగా అంటే...1980 మధ్యకాలంలో 24వేల అంబాసిడర్ వాహన విక్రయాలు నమోదు కాగా, 2013-14 నాటికి విక్రయాలు 2,500 స్థాయికి పడిపోయాయి. కాగా ఈ కార్ల ఉత్పత్తి మూడు సంవత్సరాల క్రితం ఆగిపోయింది.