'అసెంబ్లీకి తాజా ఎన్నికలు నిర్వహించండి'
న్యూఢిల్లీ శాసనసభకు తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని కేజ్రీవాల్ తన నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమైయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఎన్నికలకు వెళ్లకుండా హస్తినలో మరో సారి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. న్యూఢిల్లీ శాసనసభకు తాజాగా ఎన్నికలు నిర్వహిస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎంగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజల మధ్యకు వెళ్లనున్నట్లు తెలిపారు.
శాసనసభకు ఎన్నికై...సీఎం పదవి చేపట్టి కేవలం 49 రోజులకే సీఎం పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగి ఏడాది కూడా గడవక ముందే మరోసారి ఎన్నికలకు వెళ్తున్నందుకు కేజ్రీవాల్ ఈ సందర్బంగా హస్తిన వాసులకు క్షమాపణలు చెప్పారు. ఆ క్రమంలో వారం పది రోజుల్లో హస్తిన ప్రజల మధ్య పలు బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు కైవసం చేసుకుని ఐదేళ్ల పాటు కొనసాగించ లేకపోయామని ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. ఇటీవల దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క పార్లమెంట్ సీటు గెలుచుకోలేపోయినా, పంజాబ్లో నాలుగు ఎంపీ సీట్లు తమ పార్టీ కైవసం చేసుకున్న సంగతిని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.