ఆన్‌లైన్లో ‘హోమియో కేర్’ | Homeo Care in Online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్లో ‘హోమియో కేర్’

Published Sun, Apr 5 2015 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

ఆన్‌లైన్లో ‘హోమియో కేర్’

ఆన్‌లైన్లో ‘హోమియో కేర్’

అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు
1.30 కోట్ల మందికి చేరువయ్యాం
  విస్తరణకు రూ.40 కోట్ల వ్యయం
 సాక్షితో హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీఎండీ శ్రీకాంత్

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోమియో వైద్య రంగంలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్... ఆన్‌లైన్ వైద్య సేవలనూ విస్తరిస్తోంది. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగిస్తూ రోగులు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వైద్యులతో సంప్రదించే సౌకర్యాన్ని అమలు చేస్తోంది. దేశీయంగా రోజుకు 300 మంది వరకూ ఈ ఆన్‌లైన్ వైద్య సేవలు పొందుతుండగా అంతర్జాతీయంగా దాదాపు 100 మందికి ప్రతి రోజూ ఆన్‌లైన్ వైద్యసేవలు అందుతున్నట్లు హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ శ్రీకాంత్ మోర్లవార్ చెప్పారు. తమ కేంద్రాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలను మెడికల్ ఆడిట్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయనింకా ఏం చెప్పారంటే...
 
 నాణ్యమైన వైద్యం..
 రోగులకు అంతర్జాతీయ స్థాయి, నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే హోమియో రంగంలో తొలిసారిగా మెడికల్ ఆడిట్ పేరుతో అన్ని హోమియోకేర్ ఇంటర్నేషనల్ కేంద్రాలనూ కేంద్రీకృత వ్యవస్థకు అనుసంధానించాం. రోగి ఏ కేంద్రానికి వెళ్లినా వైద్యులు సిఫార్సు చేస్తున్న మందులను పర్యవేక్షిస్తాం. అనుసరించాల్సిన వైద్య విధానాన్ని వైద్యులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచిస్తాం. తదనంతరం సమస్య తీరును క్రమానుసారం అధ్యయనం చేసి రోగులకు, వైద్యులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తాం. ఈ విధానంలో వైద్యులకు జవాబుదారీ పెరుగుతుంది. హోమియోకేర్‌కు చెందిన 300 మంది వైద్యులతోపాటు భారత్‌తోసహా విదేశాలకు చెందిన మరో 300 మంది వైద్యులకు హోమియో వైద్యంలో కొత్త అంశాలపై ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నాం.
 
 ఆన్‌లైన్‌లో 30 శాతం..
 మూడు దశాబ్దాల సంస్థ ప్రస్థానంలో 1.30 కోట్ల మందికిపైగా వైద్యం అందించాం. డిసెంబర్‌కల్లా ఈ సంఖ్య 1.80 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నాం. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది కనక ఈ అంచనా వేస్తున్నాం. వంశపారంపర్య సమస్యలు, సంతానలేమి, మధుమేహం, కీళ్ల నొప్పుల వంటి క్లిష్ట సమస్యలకు చికిత్స ఇస్తున్నాం. 30 శాతం మంది ఆన్‌లైన్‌లోనే పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దేశీయంగా హోమియో మార్కెట్ పరిమాణం 2014-15లో రూ.6,000 కోట్లుంది. 2015-16లో రూ.7,000 కోట్లను దాటుతుంది. హోమియోను కార్పొరేట్ స్థాయికి తెచ్చింది మేమే.
 
 విస్తరణకు రూ.40 కోట్లు..
 కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో 32 కేంద్రాల్ని నిర్వహిస్తున్నాం. మహారాష్ట్ర, ఒడిశా, కేరళతోపాటు సింగపూర్, దుబాయి, యూకేల్లో అడుగు పెడుతున్నాం. ఏడాదిలో కొత్తగా 15 కేంద్రాలు రానున్నాయి. క్లినిక్‌ల ఏర్పాటు, టెక్నాలజీ, శిక్షణకు గాను 2015-16లో రూ.40 కోట్లు వెచ్చిస్తున్నాం. వాటా విక్రయించాలంటూ వచ్చిన రూ.300 కోట్ల ఆఫర్‌ను కాదనుకున్నాం. 2017 కల్లా 100 క్లినిక్‌లను ఏర్పాటుచేస్తాం. ఆ తర్వాతే వాటా విక్రయానికి వెళతాం. వైద్య కళాశాల, ఔషధ తయారీ యూనిట్ పెట్టాలన్న ఆలోచన ఉంది. దేశ, విదేశాలకు చెందిన అగ్రస్థాయి కంపెనీల నుంచి మందులను సేకరించి, కాంబినేషన్లను సొంతంగా అభివృద్ధి చేస్తున్నాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement