దొంగను పట్టించిన ఐఫోన్ యాప్
వాషింగ్టన్: అమెరికాలో ఒక వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి కెమెరా, యాప్‌ల సహాయంతో ఒక దొంగను పట్టించగలిగాడు. వివరాల్లోకి వెళ్తే బ్రియాన్ (25) అనే వ్యక్తి అమెరికాలోని సాల్ట్‌లేక్ సిటీలో నివాసముంటున్నాడు. తను ఇంట్లో లేకపోయినా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకనే విధంగా 'నెస్ట్‌కామ్' అనే ఐఫోన్ యాప్‌ని ఇంట్లో ఉన్న సీసీ కెమెరాతో అనుసంధానం చేశాడు.
గురువారం రాత్రి బ్రియాన్ ఇంటికొచ్చేసరికి అతని ఇంట్లో లైట్లు వెలిగి ఉండటం గమనించాడు. అతనికి అనుమానం వచ్చి ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అనే అనుమానంతో బయట నుంచే అతని యాప్ ద్వారా లోపల ఏం జరుగుతుందో గమనించాడు. అందులో లోపల ఎవరో గుర్తు తెలియని మహిళ ఉన్నట్టు బ్రియాన్ గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాధానం అందించాడు. పోలీసులు వచ్చి ఆమె పేరు డెన్నెట్ (38)గా నిర్ధారించి, తరచూ దొంగతనాలకు పాల్పడుతుందని తెలిపారు.