‘ఎఫ్‌బీఐలో పనిచేయడం అదృష్టం’ అంటాడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్. ‘ఎఫ్‌బీఐ’లో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ఇండో–అమెరికన్ సోహిని సిన్హా ఎప్పుడూ అదృష్టాన్ని నమ్ముకోలేదు. కష్టాన్నే ఇష్టంగా నమ్ముకుంది. ఎఫ్‌బీఐలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో స్థాయిలలో పనిచేసింది. తాజాగా సోహిని సిన్హాను ఎఫ్‌బీఐ సాల్ట్‌లేక్ సిటీ ఫీల్డ్ ఆఫీస్స్పెషల్ ఏజెంట్ ఇన్‌చార్జిగా నియమించింది...
ఎఫ్‌బీఐలో సోహిని సిన్హాకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. కౌంటర్–టెర్రరిజం ఇన్వెస్టిగేషన్‌లో మంచి పేరు తెచ్చుకుంది. భద్రతకు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలను హ్యాండిల్ చేయడంలో, క్రిమినల్ సైబర్ ఇన్వెస్టిగేషన్‌లో దిట్టగా పేరున్న సోహిని సిన్హా తన వృత్తిపరమైన అంకితభావంతో ఎన్నో ప్రమోషన్‌లు పొందింది.
2001లో ఎఫ్‌బీఐలో స్పెషల్ ఏజెంట్‌గా చేరిన సిన్హా 2009లో సూపర్‌వైజరీ స్పెషల్ ఏజెంట్‌గా నియామకం అయింది. ఆ తరువాత వాషింగ్టన్ డీసీలోని కౌంటర్–టెర్రరిజం విభాగానికి బదిలీ అయింది. 2012లో అసిస్టెంట్ లీగల్ అటాషైగా ప్రమోట్ అయింది. కౌంటర్ టెర్రరిజమ్‌కు సంబంధించిన వ్యవహారాల్లో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలిస్, కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌లతో కలిసి పనిచేసింది.
ఆ తరువాత ఫీల్డ్ సూపర్‌వైజర్ (డెట్రాయిట్ ఫీల్డ్ ఆఫీస్)గా ప్రమోట్ అయింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఉగ్రవాదానికి సంబంధించిన సంక్లిష్టమైన కేసులను ఇన్వెస్టిగేట్ చేసింది.2020లో సైబర్ ఇన్‌ట్రూజన్ స్క్వాడ్‌లో చేరింది. తన నాయకత్వ సమర్థతతో 2021లో నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్‌కు సంబంధించి అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్ ఇన్‌చార్జి (పోర్ట్‌లాండ్ ఫీల్డ్ ఆఫీస్) గా ప్రమోట్ అయింది. ఏజెన్సీ ఆపరేషన్స్‌లో తనదైన ముద్ర వేసింది.
ఆ తరువాత ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు ఎగ్జిక్యూటివ్ స్పెషల్ అసిస్టెంట్‌గా నియామకం అయింది. ఇంటర్నేషనల్ ఎసైన్‌మెంట్స్‌లో కూడా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్ నుంచి ఇరాక్ వరకు ఎన్నో దేశాల్లో, ఎన్నో సంస్కృతుల మధ్య పనిచేసింది.ఎఫ్‌బీఐలో చేరడానికి ముందు సోహిని సిన్హా థెరపిస్ట్‌గా, ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన క్లినిక్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసింది. ఇక చదువు విషయానికి వస్తే సైకాలజీలో డిగ్రీ, మెంటల్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ చదువు తన వృత్తి జీవితంలో ఎంతో ఉపయోగపడింది. ఇతరులకు సహాయపడాలనే సోహిని సిన్హా తపనకు ఎఫ్‌బీఐ బలమైన వేదికలా ఉపయోగపడుతోంది.
కష్టాన్నే నమ్ముకుంది! అదే ఆమెను ఎఫ్‌బీఐకి తిరుగులేని ఏజెంట్‌గా..
Published Sat, Aug 5 2023 3:58 AM | Last Updated on Sat, Aug 5 2023 10:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment