
26/11 మృతులకు ఘన నివాళి
* ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు
* సిద్ధమని పార్లమెంట్ సభ్యుల ప్రతిజ్ఞ
* భద్రతా బలగాల సాహసాన్ని కొనియాడిన లోకసభ స్పీకర్
న్యూఢిల్లీ: 2008 నవంబర్ 26 ముంబై ఉగ్రవాద దాడుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి పార్లమెంట్ ఘన నివాళులర్పించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరుకు సిద్ధమని సభ్యులంతా ప్రతిజ్ఞ చేశారు. భారత్‌సహా ప్రపంచ దేశాలంతటా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెరికివేసేందుకు ధృఢ సంకల్పంతో సన్నద్ధమవ్వాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలుపునిచ్చారు.
ముంబైలో నరమేథం సృష్టించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొని తుదముట్టించిన భద్రతా బలగాల సాహసాన్ని ఆమె కొనియాడారు. ముంబైలోని పోలీస్ జింఖానాలో ఏర్పాటు చేసిన ‘26/11 పోలీస్ స్మారకం’ వద్ద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాళి అర్పించారు.
కార్యక్రమంలో అమర పోలీసుల కుటుంబ సభ్యులు, అఖిల భారత ఉగ్రవాద వ్యతిరేక ఫ్రంట్ (ఏఐఏటీఎఫ్) చైర్మన్ ఏఎస్ బిట్టా నివాళులర్పించారు. ఉగ్రదాడులు జరిగిన తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ టర్మినస్‌లను ఫ్రంట్ సభ్యులతో కలసి బిట్టా సందర్శించారు.
సవాళ్లకు సిద్ధం: నేవీ చీఫ్: ముంబై దాడుల తరహాలో సముద్ర మార్గం వెంట పొంచి ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు నావికా దళం సిద్ధంగా ఉందని నావికాదళ ప్రధానాధికారి, అడ్మిరల్ ఆర్‌కే ధావన్ ప్రకటించారు. కేరళలోని కన్నూర్‌లో ఇండియన్ నేవీ అకాడమీలో మీడియాతో ఆయన మాట్లాడారు. 87 ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ స్టేషన్లు, 46 కోస్టల్ రాడార్ స్టేషన్లతో సముద్రమార్గంలో, తీరం వెంట భద్రతను మరింత పటిష్టం చేసేందుకు నావికా దళం చర్యలు తీసుకుందన్నారు.
బాలీవుడ్ నివాళి: ముంబై దాడులకు ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు అమరులకు నివాళులర్పించారు. సూపర్‌స్టార్ షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్, అనుపమ్ ఖేర్, ప్రీతి జింటా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
26/11 దాడుల అనంతరం కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి ఆర్డీ ప్రధాన్, మాజీ ప్రత్యేక కార్యదర్శి వప్పల బాలచంద్రన్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిన ద్విసభ్య కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ప్రస్తుతం ఆ సిఫార్సుల అమలు తీరుపై విశ్లేషణ..
సిఫార్సు: 1) నిఘా వర్గాల నుంచి సమాచారం అందినపుడు వెంటనే సీనియర్ పోలీసు అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలి.
బృందంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లాఅండ్ ఆర్డర్), ఏటీఎస్, ఎస్‌బీ, భద్రత, నేర విభాగాలకు చెందిన అదనపు కమిషనర్లు సభ్యులుగా ఉండాలి. సమాచార వివరాలను బృందం ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాలి.
వాస్తవం: బృందం ఏర్పాటయ్యింది. కొద్ది రోజుల పాటు సమీక్ష నిర్వహించేవారు. అయితే ఇప్పుడు ఆ కమిటీకి అంత ప్రాధాన్యం లేదు.
2) జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) తరహాలోనే ప్రత్యేక భద్రత దళాన్ని ఏర్పాటు చేయాలి.
వాస్తవం: 200మంది సభ్యులతో ‘ఫోర్స్ వన్’ను ఏర్పాటు చేశారు. ఇప్పుడది పనిచేయట్లేదు.
3) ముంబై పోలీసులకు అధునాతన ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందజేయాలి.
వాస్తవం: ఆయుధాలను సమకూర్చింది. అధికారులు, నేతల అవినీతి కారణంగా శక్తివంతమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందుబాటులోకి రాలేదు.
4) క్విక్ రెస్పాన్స్ టీంను బాగా శిక్షణ ఇచ్చి చిన్న గ్రూపులుగా విభజించాలి. ముంబై సీపీ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగేలా ఉండాలి
వాస్తవం: శిక్షణ అయితే ఇచ్చారు కాని ఇప్పుడు ఆ టీంలు ముంబైలో ఎక్కడా కనిపించవు.
5) కోస్టల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. వేగంగా వెళ్లే బోట్లు కొనుగోలు చేయాలి.
వాస్తవం: ఏడు బోట్లు కొనుగోలు చేసింది. ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరిపోయాయి.
6) కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
వాస్తవం: ఏడెళ్లలో మొదటి దశలో 103 మాత్రమే అమర్చారు.