తగరపువలస(విశాఖపట్టణం): విశాఖ జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. విశాఖపట్నంలోని తగరపువలస ప్రాంతంలోని ఓ నగల దుకాణంలో గురువారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. మెయిన్ రోడ్డులో ఉన్న సాయిపద్మ జ్యువెలరీ దుకాణం పై అంతస్తులో యజమాని ఉప్పల శ్రీకాంత్ నివాసం ఉంటుంది. దుకాణంలో సొత్తును ప్రతిరోజూ ఆయన ఇంట్లోనే భద్రపరుస్తుంటారు.
రోజు మాదిరిగానే సుమారు ఏడు కిలోల బంగారు, వెండి ఆభరణాలను దుకాణంలోకి తీసుకువచ్చిన శ్రీకాంత్ వాటిని అక్కడే ఉంచి... ఎదురుగా రోడ్డు అవతల ఉన్న సాయిబాబా ఆలయంలోకి వెళ్లారు. అక్కడ బాబాను దర్శించుకుని తిరిగి వచ్చి చూసేసరికి నగలు ఉన్న బ్యాగులు కనిపించలేదు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.